విమాన ప్రయాణంలో అసౌకర్యానికి గురైన కీర్తి సురేష్

త‌న అనుభ‌వాన్ని పంచుకున్న స‌హ‌జ న‌టి

హైద‌రాబాద్ : నటి కీర్తి సురేష్ విమాన ప్రయాణంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. తోటి ప్రయాణికుడొకరు తనతో సెల్ఫీ తీసుకోవాలని పట్టుబట్టడంతో తాను అసౌకర్యానికి గురయ్యానని ఆమె తెలిపారు. అభిమానులతో ఫోటోలు దిగడం తనకు ఇబ్బంది లేదని, కానీ ఎవరైనా వ్యక్తిగత హద్దులను అతిక్రమించినప్పుడు మాత్రం అసౌకర్యంగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కీర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి మిలన్ నుండి భారతదేశానికి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పింది కీర్తి సురేష్.కీర్తి తెలిపిన వివరాల ప్రకారం, విమాన ప్రయాణంలో మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిన ఒక ప్రయాణికుడు ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీ అడిగాడు. అతను సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉండటంతో, కొంచెం వేచి ఉండమని కీర్తి అతడిని కోరారు.

అయితే, ఆ ప్రయాణికుడు ఆమె మాట వినకుండా వెంటనే ఫోటో దిగాలని పట్టుబట్టాడు. అతని ప్రవర్తన కీర్తికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. ఈ ఘటనతో కీర్తి భర్త ఆంటోనీ తట్టిల్ కూడా అసహనానికి గురయ్యారు. పరిస్థితి సద్దుమణగ కపోవడంతో, వారు విమాన సిబ్బందిని ఆశ్రయించాల్సి వచ్చింది.
అభిమానులతో సంభాషించడం, వారు చూపే ప్రేమను స్వీకరించడం తనకు ఇష్టమేనని కీర్తి స్పష్టం చేశారు. చాలా మంది అభిమానులు ఎంతో మర్యాద పూర్వకంగా తన దగ్గరకు వచ్చి, తమ అభిమానాన్ని గౌరవప్రదంగా తెలియ జేస్తారని ఆమె పేర్కొన్నారు. అయితే సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత స్థలం అవసరమని, అభిమానులు వారి హద్దులను గౌరవించాలని కీర్తి అభిప్రాయపడ్డారు. ఎవరైనా మర్యాదగా అడిగినప్పుడు ఫోటో దిగడంలో ఎలాంటి సమస్య లేదని, కానీ తాను అసౌకర్యంగా ఉన్నప్పటికీ బలవంతంగా సెల్ఫీ అడగడం మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రయాణాల్లో సెలబ్రిటీలను కలిసినప్పుడు వారి వ్యక్తిగత హద్దులను గౌరవించాల్సిన ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసింది.

Leave A Reply

Your Email Id will not be published!