హైదరాబాద్ : స్వతంత్ర క్లౌడ్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవల సంస్థ అయిన భారత్‌క్లౌడ్ తన రెండవ కార్యాలయాన్ని ప్రారంభించింది. సాంకేతిక , వ్యాపార విభాగాలలో 500 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది ఈ సందర్బంగా. ఈ కొత్త కార్యాలయం సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. కంపెనీకి సంబంధించి విస్తరిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ , ఏఐ మౌలిక సదుపాయాల కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కార్యాలయంలో ప్రతిపాదిత గ్లోబల్ నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్ కూడా ఉంటుంది. ఈ నియామక ప్రక్రియలో క్లౌడ్ ఇంజనీరింగ్, ఏఐ మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ కార్యకలాపాలు, సైబర్‌సెక్యూరిటీ, కస్టమర్ సపోర్ట్ , వ్యాపార కార్యకలాపాలతో సహా పలు రంగాలను కవర్ చేస్తారు.
భారత్‌క్లౌడ్ తన క్లౌడ్ , ఏఐ సేవలను అభివృద్ధి చేస్తున్నందున, ఈ ప్రణాళికాబద్ధమైన విస్తరణ దాని కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త కార్యాలయం , ప్రతిపాదిత జీఎన్ఓసీ దాని మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తోంది. ఇదిలా ఉండగా ఓ వైపు ఏఐ కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. మరోవైపు ఏఐ, ఎంఎల్, సైబకర్ సెక్యూరిటీకి సంబంధించి పెద్ద ఎత్తున జాబ్స్ రాబోతున్నాయని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. టెక్కీలు పాత కాలపు పద్దతలను కాకుండా కొత్తగా వచ్చే టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. లేకపోతే జాబ్స్ పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
