యలహంక ప్రాపర్టీ నాదే : వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

ఎక్స్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పీసీసీ చీఫ్

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న సోద‌రుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప‌రోక్షంగా ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గ‌త కొంత కాలంగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన య‌ల‌హంక ప్రాప‌ర్టీ పై స్పందించారు. ఏనాటికైనా ఆ ప్రాప‌ర్టీ త‌న‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. అయితే జ‌గ‌న్ రెడ్డితో పాటు ఆయ‌న ప‌రివారం త‌న‌పై చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టారు. వారి వ్యాఖ్య‌ల‌ను తాను ప‌ట్టించుకోనంటూ పేర్కొన్నారు. తనది కాని దానికోసం ఆశపడే నీచత్వం తనకు లేదని ష‌ర్మిలా రెడ్డి అన్నారు.

జగన్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ 100% నాకు, నా పిల్లలకు వచ్చిందని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇది దేవుడి సాక్షిగా నిజం అని తెలిపారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి, నా తండ్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తిరిగిన‌ ఇల్లు కనుక కూతురు అంజిలి కోరిక మేరకు పెళ్లి అక్కడే చేయాలనుకున్నాం అని వెల్ల‌డించారు ష‌ర్మిలా రెడ్డి. కానీ ఇప్పుడు తన ఆకాంక్షను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభ్యంత‌రాలు లేవ‌దీయ‌డం వ‌ల్ల నెరవేర్చలేక పోతున్నామని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెళ్లి వేరే ప్రదేశంలో జరిపించాలని నిర్ణయించాం అని తెలిపారు. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది అది ఎవ‌రికి చెందిన ఆస్తి అనేది అన్నారు. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని, కానీ తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను తాను నెర‌వేర్చ‌లేక పోతున్నందుకు బాధ‌గా ఉంద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!