ఐటీ రంగం అభివృద్దిలో ఇన్ఫోసిస్ కీల‌క పాత్ర

స్ప‌ష్టం చేసిన ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ : హైదరాబాద్‌ను కేవలం పెట్టుబడులకు అనుకూలమైన నగరంగానే కాకుండా మెరుగైన జీవన ప్రమాణాలతో ప్రజలు నివసించడానికి వీలుగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, వేగవంతమైన పరిపాలన, నిరంతర విద్యుత్ సరఫరా , పర్యావరణహిత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు.

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని పోచారం వద్ద ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో చేపట్టిన విస్తరణలో భాగంగా నిర్మించిన కొత్త కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానిక ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు వారికి ఘనస్వాగతం పలికారు. కంపెనీ ప్రొఫైల్, అంతర్జాతీయ కార్యకలాపాలు, పోచారం క్యాంపస్ ప్రత్యేకతలు, కొత్త భవన విస్తరణ , ఆధునిక సౌకర్యాల గురించి ఇన్ఫోసిస్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్‌లో మరోసారి పెట్టుబడులు పెట్టడం ఈ నగరంపై ఆ సంస్థకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 48,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఇన్ఫోసిస్ తాజాగా పది లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకు రావడం రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి దోహద పడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఐటీ రంగం వేలాది కుటుంబాల జీవితాల్లో ఆర్థిక, సామాజిక మార్పులను తీసుకు వచ్చిందని, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు కుటుంబాల అభ్యున్నతికి మార్గం సుగమం చేసిందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలు వస్తున్న నేపథ్యంలో, యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ఆచరణాత్మక అనుభవం , ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆయన సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!