హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఐపీఎస్ అధికారి పి. సీతారామ ఆంజనేయులు తో పాటు మరికొందరి ప్రాంగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు అధికారులు. ఈ చర్యలో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో మొత్తం ఏడు ప్రాంగణాలను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీ చేశారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదు చేయబడిన ఈ ఈడీ కేసు ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు సంబంధించినది. ఈ మూల్యాంకనం సందర్భంగా ఒక ప్రైవేట్ పార్టీకి రూ.1.14 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ సమయంలో ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ఉండగా, మాన్యువల్ మూల్యాంకనం చేసే పనిని క్యామ్‌సైన్ మీడియా అనే కంపెనీకి అప్పగించినట్లు ఈడీ తెలిపింది. 1992 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి నివాసంతో పాటు, క్యామ్‌సైన్ మీడియా ఎండీ పి. మధుసూదన రావు, గుంటూరు జిల్లాలోని చినకకాని గ్రామంలో ఉన్న ఆవాస రిసార్ట్ హైలాండ్ లలో కూడా సోదాలు జరిగాయి.
స్టోన్ మీడియా అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక విభాగమైన ట్రూగ్రేడర్ సర్వీసెస్ దాని ఎండీ అకెళ్ల పెరి శ్రీనివాసరావు, మూల్యాంకన పనిలో నిమగ్నమైన మహామకాళి రఘురామ్ కార్యాలయాలు కూడా ఉన్నాయని ఈడీ పేర్కొంది.
