ఇంద్రకీలాద్రి : శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తీక మాస పర్వ దినాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో వైదిక కమిటీ సూచనల మేరకు నవంబర్ 10 నుండి డిసెంబర్ 08వ తేదీ వరకు నెల రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దేవస్థాన కార్య నిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్. నవంబర్ 09వ తేదీ ప్రదోష కాలంలో శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం , శ్రీ నటరాజ స్వామి వారి ఆలయాలలో శాస్త్రోక్తంగా “ఆకాశ దీపం” ఏర్పాటు చేస్తామన్నారు. కార్తీక మాసమంతా ప్రతిరోజూ ఉదయం 6:00 నుండి 9:00 గంటల వరకు ప్రథమ కాల అభిషేకాలు, ఉదయం 8:00 నుండి 11:00 గంటల వరకు లక్ష్మీ గణపతి పంచాక్షరీ పఠనం, కారక పారాయణములు, ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ద్వితీయ కాల అభిషేకాలు జరుగుతాయని ఈవో తెలిపారు. అలాగే మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తృతీయ కాల అభిషేకాలు, మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:00 గంటల వరకు ప్రత్యేక బిల్వార్చనలు, లక్ష బిల్వార్చనలు, సహస్ర లింగార్చనలు , రాత్రి 7:00 గంటలకు ఊంజల్ సేవ (దీపోత్సవ ఆర్జిత సేవ) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
13న నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జామున 4:00 గంటలకు అభిషేకం, సాయంత్రం 5:00 గంటలకు దీపోత్సవం జరుగుతుందని తెలిపారు. అలాగే నవంబర్ 24న కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సాయంత్రం 6:30 గంటలకు “కోటి దీపోత్సవం”, రాత్రి 7:00 గంటలకు శివాలయంలో “జ్వాలాతోరణం” అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు ఈవో. భక్తుల సౌకర్యార్థం నవంబర్ 16 (కార్తీక శుద్ధ సప్తమి), నవంబర్ 20 (కార్తీక శుద్ధ ఏకాదశి), నవంబర్ 23 (కార్తీక శుద్ధ చతుర్దశి), నవంబర్ 24 (కార్తీక పౌర్ణమి), నవంబర్ 30 (కార్తీక బహుళ షష్ఠి), డిసెంబర్ 04 (కార్తీక బహుళ ఏకాదశి), డిసెంబర్ 07 (కార్తీక బహుళ చతుర్దశి – మాస శివరాత్రి) తేదీలలో మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:00 గంటల వరకు ప్రత్యేక బిల్వార్చన (ఆర్జిత సేవ), అనంతరం రాత్రి 7:00 గంటలకు భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు శీనా నాయక్.
ఈ సందర్భంగా ఆలయాలలో నిర్వహించే పూజలలో పాల్గొనే భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. సహస్ర లింగార్చన (నెల రోజులకు): రూ. 5,116/- , ప్రత్యేక బిల్వార్చన (ఒక రోజుకు): రూ. 2,000/-, నిత్య ఆర్జిత రుద్ర హోమం రూ. 1,000/-, సహస్ర లింగార్చన (ఒక రోజుకు): రూ. 500/-, ఊంజల సేవ (దీపాలంకరణ – ఒక టికెట్‌పై ఒకరికి): రూ. 50/- రుసుము చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి ఈ పవిత్ర పూజాదికాలలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ అమ్మ వారు , శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల కృపా కటాక్షాలు పొందాలని ఈవో కోరారు.
