రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం
ప్రజా ప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు రాష్ట్ర గృహ నిర్మాణ, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖలకు సంబంధించిన అనేక అంశాలపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులతో కలిసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి , వికారాబాద్ జిల్లాలకు సంబంధించి పలు సమస్యలను ప్రజా ప్రతినిధులు ప్రస్తావించారు. ప్రధానంగా రైతుల ప్రయోజనాల కోసమే చేపట్టిన భూముల రీసర్వే వారి సమక్షంలోనే చేసి భూ సమస్యల పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రీసర్వే జరిగే గ్రామాల్లో ప్రతిరోజు తహశీల్దార్లు పర్యటించాలని అన్నారు. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించడమే గాక కనీసం వారానికో రోజు రీసర్వే జరిగే గ్రామాలకు వెళ్లాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలు, భూముల హద్దులపై నెలకొన్న వివాదాలు వంటి అంశాలను కూడా సమగ్ర సర్వే ద్వారా గుర్తించి పరిష్కరిష్కరించాలని అన్నారు మంత్రి. 22ఎ కు సంబంధించి ఇప్పటి వరకు ఇచ్చిన జీవోలు, మెమోలతో పరిష్కారం కానీ అంశాలు ఏమైనా ఉంటే పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం తొలివిడత మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లలో ఇప్పటికి 2,21,500 గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని చెప్పారు. ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ప్రతి పేద కుటుంబంలో ఆనందాల వెలుగులు నిండి, ప్రతి ఇందిరమ్మ ఇంటి గడపలో దీపావళి కాంతులు విరజిమ్మాలని “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు గృహ ప్రవేశాలు జరుపుకున్న ఇందిరమ్మ ఇళ్లలో ఈ దీపావళి రోజున ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ భాగస్వాములై మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి అనే వేడుకను లబ్దిదారులతో కలిసి కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించాలని కోరారు.