రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో విధ్వంసం : రాజేంద‌ర్ సింగ్

వాట‌ర్ మ్యాన్ ఆఫ్ ఇండియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం

అమ‌రావ‌తి : వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరు పొందిన‌ డాక్టర్ రాజేంద్ర సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ఝ‌ల‌క్ ఇచ్చారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణానది ఫ్లడ్ ప్లెయిన్స్, జరీబు భూములు, ఇసుక తవ్వకాల ప్రదేశాలను పరిశీలించారు. రాజధాని అభివృద్ధి పేరుతో కృష్ణానది పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేస్తే అది అమరావతి భవిష్యత్తుకే తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. అమరావతి పర్యావరణ అనుమతుల్లోని నిబంధన ప్రకారం కృష్ణానదికి సమాంతరంగా ఉన్న 2 నుండి 3 కిలోమీటర్ల భూభాగాన్ని కేవలం బ్లూ-గ్రీన్ మౌలిక సదుపాయాలు, పట్టణ వ్యవసాయం కోసమే కేటాయించాలని స్ప‌ష్టం చేశారు రాజేంద‌ర్ సింగ్. కానీ ​ప్రస్తుతం జరుగుతున్న భూసేకరణ, భూ వినియోగ మార్పులు ఈ నిబంధనకు అనుగుణంగా ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రతిరోజూ కరకట్ట మీదుగా ప్రయాణించే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఈ నష్టాన్ని స్వయంగా గమనించి, అవసరమైతే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు. నదిలో 40 అడుగుల లోతు వరకు జరుగుతున్న యంత్రాల డ్రెడ్జింగ్ వల్ల నదీ గర్భం మారిపోతోందని, నదీ తీరాలు కోతకు గురవుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది కృష్ణానది కరకట్ట భద్రతకు తీవ్ర ముప్పు కలిగించి, విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రజలకు వరద ప్రమాదం తెచ్చి పెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రాజేంద‌ర్ సింగ్. జ‌రీబు భూములు వరద నీటిని నిల్వ చేయడానికి, భూగర్భ జలాల పునరుద్ధరణకు, జీవ వైవిధ్య పరిరక్షణకు , ఆహార భద్రతకు అత్యంత కీలకమైనవని స్పష్టం చేశారు. ఫ్లడ్ ప్లెయిన్స్‌లో జరుగుతున్న నిర్మాణాలు, భూసేకరణపై నిపుణుల కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పర్యావరణ అనుమతుల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!