కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధికే ప్రజల పట్టం

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మ‌హ‌మ్మ‌ద్ న‌జీర్ అహ్మ‌ద్

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పల్లె నుంచి పట్నం వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా, ఘన విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజానీకానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తరుణంలో నిర్వహించిన ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన రెఫరెండం వంటివని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను పల్లెల్లో, పట్టణాల్లో ఎంత చిత్తశుద్ధితో అమలు చేశామో ప్రజలు స్వయంగా చూశారని, తాము చేసిన అభివృద్ధిని గుర్తించి ఓటు రూపంలో భుజం తట్టి నిలబడ్డారని అన్నారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రామాలు, నగరాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. నగర పాలనను నరక పాలనగా మార్చి, కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలోకి నెట్టారని మండిపడ్డారు. అంతేకాకుండా స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను సైతం దారిమళ్లించి పంచాయతీలను, మున్సిపాలిటీలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలు, నగర పాలక సంస్థలకు పూర్వ వైభవం తెచ్చామని, నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ ప్రతి పల్లెను, ప్రతి వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి, అభివృద్ధికి పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు. రెండున్నర ఏళ్ల కూటమి పాలనపై ప్రజల ఆశీర్వాదం.. వైఎస్సార్సీపీని తిరస్కరించిన ఓటర్లు
రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఏకపక్ష మద్దతు ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు సహా అన్ని స్థాయిల్లో వెలువడిన ఈ ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు, సంక్షేమానికి దక్కిన గౌరవమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి సామాజిక పింఛనును ₹2000 నుంచి ₹3000 చేయడానికి దాదాపు ఐదేళ్ల సమయం తీసుకున్నారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛను మొత్తాన్ని ₹4000 చేయడమే కాకుండా, పెంచిన బకాయిలు ₹3000 సైతం లబ్ధిదారులకు ఒకేసారి ఖాతాల్లో వేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోంద‌న్నారు. పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ‘తల్లికి వందనం’ ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం వంటి పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజధాని లేని దుస్థితిలో వదిలేస్తే, చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానంతో ‘అమరావతి’ని ఏకైక రాజధానిగా నిలబెట్టి పనులు పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 36 ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగవంతం చేసి పల్లెలను సస్యశ్యామలం చేసే చర్యలు చేపట్టారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తున్నార‌ని తెలిపారు. ప్రజలు బ్యాలెట్ ద్వారా కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టారని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!