హైదరాబాద్ : స్టార్ హీరోలు రామ్ చరణ్ , అక్కినేని నాగార్జున లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇట్లు అర్జున’ మూవీతో అనీష్‌కు బ్లాక్‌బస్టర్ ఖాయమని జోష్యం చెప్పారు. నాగార్జున సమర్పిస్తున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంపై ఎంతో నమ్మకంతో, సంతోషంతో ఉన్నారు. నవంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం నిర్వహించిన భారీ సంగీత కచేరీలో,నూతన నటుడు అనీష్ చేసిన పనితీరును వారు అభినందించారు. అనీష్ ప్రదర్శించిన నిజాయితీ, నటన చూసి రామ్ చరణ్ ముగ్ధులయ్యారు. అనీష్ తన మొదటి చిత్రంలోనే ఎంతో సవాలుతో కూడిన పాత్రను పోషించారని పేర్కొన్నారు. ‘రంగస్థలం’ చిత్రంలో తన నటనను గుర్తుకు తెచ్చేలా అనీష్ అద్భుతంగా నటించారని ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.
అలాగే దర్శకుడు మహేష్ ఉప్పల, నిర్మాత వెంకీ కుడుముల , సంగీత దర్శకుడు ఎస్. తమన్ల పని తీరును కూడా ఆయన ప్రశంసించారు. అనీష్ నటన తనను ఆశ్చర్యప రిచిందని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనీష్లోని హావభావాలను, అతనిలో ఉన్న నిశ్శబ్ద శక్తిని ఆయన మెచ్చుకున్నారు. అనీష్ , అనస్వర రాజన్ మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అఖిల్ అక్కినేని కూడా ఈ చిత్రంలోని నటన, సంగీతం , కమర్షియల్ అంశాలను అభినందించారు.
‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంతో మహేష్ ఉప్పల దర్శకుడిగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు చార్ట్బస్టర్లుగా నిలవగా, ప్రమోషన్ల ద్వారా కూడా మంచి స్పందన లభిస్తోంది. దీనివల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
