క్రెడిట్ చోరీలో చంద్రబాబు నాయుడు దిట్ట : జ‌గ‌న్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి గూడెం : మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమ హ‌యాంలో చేప‌ట్టిన ప‌నుల‌ను తామే చేసిన‌ట్టు త‌న ఖాతాలో వేసుకోవ‌డం సిగ్గు అనిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. మీకు ఏ మాత్రం సంబంధం లేని విజయాన్ని కూడా మరోసారి ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా మీ ఘనతగా చెప్పుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సాధించిన పురోగతిని కూడా మీ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? అని నిల‌దీశారు. ‘ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ’ (జేజీయూ), ‘సెంటర్‌ ఫర్‌ న్యూ ఎకనామిక్స్‌ స్టడీస్‌’ (సీఎన్‌ఈఎస్‌)తో కలిసి 2024లో ఒక నివేదిక ప్రచురించింది. సామాజిక, మానవాభివృద్ధికి సంబంధించి అత్యంత కీలకమైన ఐదు ప్రధాన అంశాల ఆధారంగా, ఆ నివేదిక తయారుచేసి రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించింది. అంతే కాకుండా ఆ ఐదు అంశాలకు నిర్దిష్ట వెయిటేజీ (మార్కులు) కేటాయించి, వాటి ఆధారంగా రూపొందించిన సమగ్ర సూచీ (కాంపోజిట్‌ ఇండెక్స్‌) ప్రకారం కూడా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. ఇదే యూనివర్సిటీ, అదే సీఎన్‌ఈఎస్‌తో కలిసి 2021లో కూడా అదే తరహా అధ్యయనం చేసి, అప్పుడు కూడా ఒక నివేదిక విడుదల చేసింది.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. 2021 ఏఈఐ నివేదికలో రాష్ట్రాల ర్యాంకింగ్స్‌ కోసం ఉపయోగించిన అత్యధిక సూచికలకు సంబంధించిన గణాంకాలు 2019కి ముందు కాలానికి చెందినవి. అదే 2024 ఏఈఐ నివేదికలో అన్ని సూచికలకు ఉపయోగించిన గణాంకాలు 2021 నుంచి 2023 మధ్య కాలానికి చెందినవి. అందువల్ల ఈ రెండు నివేదికలను పోల్చి చూస్తే, వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు.. ఏర్పడిన తర్వాత రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు స్పష్టంగా తెలుస్తాయి. నివేదికకు ఆధారమైన కీలకమైన ప్రధాన అంశాల్లో ఒకటైన ఆరోగ్య సూచీ (హెల్త్‌ ఇండెక్స్‌ స్కోర్‌)కి సంబంధించి చూస్తే.. 2021 నివేదికలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో ఉంది. ఆ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాల్లో అత్యధికం 2019కి ముందు కాలానికి చెందినవి. అదే 2024 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య సూచీలో ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. ఈ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలన్నీ వైయస్సార్‌సీపీ ప్రభుత్వ కాలానికి చెందినవే. ఇక మరొక ప్రధాన అంశం సామాజిక, ఆర్థిక భద్రత సూచీకి సంబంధించి చూస్తే, 2021 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 11వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాల్లో అత్యధికం 2019కి ముందు నాటివి. అదే 2024 నివేదికలో సామాజిక, ఆర్థిక భద్రత సూచీలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ఏకంగా మొదటి స్థానానికి చేరుకుంది. ఈ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలన్నీ కూడా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ కాలానికి చెందినవే.

నిజంగా ఇది మన రాష్ట్రం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ విజయం యాదృచ్ఛికం కాదు. సంక్షేమం, అభివృద్ధికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. అత్యంత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం.. కష్టకాలంలో ప్రజల వ్యక్తిగత అవసరాలు తీర్చడం, ఆ దిశలో వారి కొనుగోలు శక్తి పెంచేలా తగిన చర్యలు చేపట్టడం.. ఇంకా 2019–24 మధ్య దక్షిణ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించేలా పరిశ్రమలు, తయారీ రంగాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచడం.. తద్వారా సామాజిక భద్రత మరింత మెరుగుపడేలా చేయడం.. వెరసి ఈ విజయానికి ప్రధాన కారణాలు. ఇక న్యాయపరమైన పరిష్కార మార్గాలకు సంబంధించిన సూచీ చూస్తే.. 2021 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో ఉంది. ఆ ర్యాంకు కోసం తీసుకున్న గణాంకాల్లో అత్యధికం 2019కి ముందు కాలానికి చెందినవి. అదే 2024 నివేదికలో అదే సూచీలో ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. ఆ ర్యాంకు కోసం ప్రామాణికంగా తీసుకున్న గణాంకాలన్నీ వైయస్సార్‌సీపీ ప్రభుత్వ కాలానికి చెందినవే.

ఇంకా అన్ని అంశాలతో కూడిన ‘సమగ్ర సూచీ’ (ఓవరాల్‌ కాంపోజిట్‌ స్కోర్‌) గమనిస్తే, 2021 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో ఉంది. ఆ ర్యాంకు కోసం తీసుకున్న గణాంకాల్లో అత్యధికం 2019కి ముందు కాలానికి చెందినవి. అదే 2024 నివేదికలో ‘సమగ్ర సూచీ’లో ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 3వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ ర్యాంకు కోసం ప్రామాణికంగా పరిగణలోకి తీసుకున్న గణాంకాలన్నీ వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనివే. వాస్తవానికి, 2024 ఏఈఐ నివేదిక ఆంధ్రప్రదేశ్‌ సాధించిన ఈ పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ అత్యంత పురోగతిని సాధించింది. 10వ స్థానం నుంచి ఏకంగా 3వ స్థానానికి ఎగబాకింది’ అని ఆ నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమం, సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యం వల్లనే మన రాష్ట్రం అనేక కీలక సూచీల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జ‌గ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అయితే వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాధించిన ఈ విజయాలను చంద్రబాబు నాయుడు ఏమాత్రం నైతికత లేకుండా తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. మరోవైపు, రాష్ట్రం ఇంతటి పురోగతిని సాధించిన 2019–24 కాలాన్ని ‘రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉన్న కాలం’ అంటూ అవమానిస్తున్నారు. అదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక సూచీల్లో దేశంలో అగ్రస్థానాలకు చేరుకుందన్న వాస్తవాన్ని ఈ నివేదిక స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!