ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జే షా. ఈ మేరకు సోమవారం ఐసీసీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇటీవల ఇండోనేషియాలోని బాలి వేదికగా ఐసీసీ బోర్డు, కమిటీ సమావేశమైంది. ఇదిలా ఉండగా డైరెక్టర్లు చేసిన ప్రతిపాదన మేరకు జై షా నియామకం ఏకగ్రీవంగా ఖరారైనట్లు ఐసీసీ వెల్లడించింది. క్రికెట్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేయడంలో జే షా కీలక పాత్ర పోషించారని తెలిపింది. అంతేకాకుండా అభిమానుల భాగస్వామ్యాన్ని పెంచడం, వాణిజ్య పరమైన అభివృద్ధి వంటి కీలక అంశాలు ముందున్న నేపథ్యంలో.. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా నాయకత్వంపై ఐసీసీ బోర్డు పూర్తి విశ్వాసం ఉంచింది.
క్రికెట్ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ సమయంలో ఆయన కొనసాగింపు ఎంతో అవసరమని బోర్డు సభ్యులు భావించారు. ఈ సందర్బంగా కీలకమైన ఐసీసీ సంస్థకు తిరిగి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియ చేశారు జే షా. తన పునర్నియామకంపై ఆయన స్పందించారు. ఐసీసీ బోర్డు తనపై చూపిన విశ్వాసానికి ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన డైరెక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా పని చేయడం ఒక గౌరవంతో పాటు పెద్ద బాధ్యత. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు సభ్య దేశాలతో కలిసి పని చేయడానికి నేను కట్టుబడి ఉన్నానని జై షా స్పష్టం చేశారు.
అంతే కాకుండా జే షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిలల్ (ఏసీసీ) చైర్మన్ గా కీలక బాధ్యతలు గతంలో చేపట్టారు. ఆయన హయాంలోనే ఐపీఎల్ మీడియా హక్కుల ఒప్పందాల అభివృద్ది జరిగింది. మహిళల క్రికెట్ లీగ్ డబ్ల్యుపీఎల్ ను ప్రారంభించారు. .పురుష, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజుల విధానం తీసుకు వచ్చారు. దేశీయ క్రికెట్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల పెంచారు. టెస్ట్ క్రికెట్ ప్రోత్సాహక పథకం ప్రవేశ పెట్టారు. క్రికెట్‌ను 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోకి తీసుకెళ్లే ప్రక్రియలో ఐసీసీ తరఫున కీలకమైన పాత్ర పోషించారు.