హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రంపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన ప్రతికూల వ్యాఖ్యల గురించి కీర్తి సురేష్ ఎట్టకేలకు స్పందించారు. ‘లెజెండ్’ చిత్రంలో రాధికా ఆప్టే బాలకృష్ణకు మేనకోడలి పాత్రలో నటించడమే కాకుండా ఆయనతో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లోనూ కనిపించారు. అయితే ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఆమె టాలీవుడ్ కథనాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నేను నటించిన ఒక తెలుగు చిత్రంలో నా మేనమామనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అది నాకు అత్యంత కష్టతరమైన సినిమా. ఆ సినిమాలో ప్రతిదీ నాకు అస్సలు నచ్చలేదు అని పేర్కొన్నారు. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ సంస్కృతుల్లో మేనమామను వివాహం చేసుకునే ఆచారం ఉంది కదా అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన రాధికా ఆప్టే అంతే కాకుండా నాకంటే చాలా పెద్ద వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది.
అక్కడ పూర్తిగా పురుషాధిక్య ధోరణి కనిపించింది, అది నాకు చాలా కష్టంగా అనిపించింది. పైగా సినిమా మధ్యలోనే నా పాత్ర చనిపోతుంది. ఆ నటుడు నన్ను భుజంపై వేసుకుని విసిరేసి, ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలు చేస్తాడు. నేను అసలు ఎప్పుడు చనిపోతాను? అని నాకు అనిపించింది అని చెప్పారు. రాధికా ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆమెను విమర్శించడమే కాకుండా ఆ సంభాషణలో భాగమైన కీర్తి సురేష్‌ను కూడా అనవసరంగా లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా తన కొత్త సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న కీర్తి సురేష్‌ను ఈ విషయం గురించి ప్రశ్నించగా ఆమె దీనిపై స్పందించారు. చివరికి కీర్తి సురేష్ తన మౌనాన్ని వీడి ఇలా స్పందించారు. ఒక సినిమాలో తన మేనమామను వివాహం చేసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నప్పుడు, అసలు ఆమె ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాతే ఆమె మన సంస్కృతి గురించి మాట్లాడుతోందని గ్రహించానని అన్నారు.
మన సంస్కృతి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది, దానికి ఎటువంటి భంగం కలగనివ్వను. వారికి మన సంస్కృతి గురించి తెలియదు కాబట్టి, నేను వారికి వివరించగలను తప్ప, ఇది మన సంస్కృతే అని నిరూపించలేను. కర్ణాటకలో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటువంటి సంస్కృతి ఉందని కేవలం సమాచారం కోసం మాత్రమే చెప్పాను. కేరళలో ఇటువంటి సంస్కృతి లేదన్నారు కీర్తి సురేష్.
