అమరావతి : ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతోంది కోట రుక్మిణి. ఇంతకూ ఎవరు ఈమె. ఎందుకంతగా ప్రాధాన్యత ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా తనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు రావడంతో ఒక్కసారిగా తన కోసం వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. ఇక తన విషయానికి వస్తే ఆమె అసలు పేరు కోట రుక్మిణి శ్వేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న గుడివాడ ఆమె స్వస్థలం. తండ్రి పేరు కోట రాజేశ్వర సుబ్రహ్మణ్య శర్మ. తల్లి పేరు వెంకటలక్ష్మి. తండ్రి ఫార్మసీ రంగంలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. తల్లి టీచర్‌గా పని చేశారు. రుక్మిణికి ఓ సోదరుడు కూడా ఉన్నారు. ఆయన పేరు పవన్ కుమార్. తను బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటారు. ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం. కుటుంబ నేపథ్యం అంతా గుడివాడే అయినప్పటికీ ఆమె పెరిగింది, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నది హైదరాబాద్‌లోనే. ఆ తర్వాత బెంగళూరులోని ఎం. విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 2009వ సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
ఆ తర్వాత నేరుగా యూకేకు వెళ్లి లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు . తను లండన్ లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ . రుక్మిణి లండన్‌లో ఐటీ కన్సల్టెంట్ , ఎంటర్‌ప్రెన్యూర్‌గా పని చేశారు ..ఈమె జాబ్ మానేసి బిజినెస్ ప్రారంభించారు . కైరన్ టెక్ లిమిటెడ్ (KYREN TECH LIMITED) ఈ కంపెనీ 28 ఏప్రిల్ 2023న రిజిస్టర్ చేయబడింది. ఆమె ఇందులో యాక్టివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రాజకీయ వర్గాల ఆరోపణల ప్రకారం, ఈ కంపెనీని అక్టోబర్ 2024 లో క్లోజ్ చేసి, తిరిగి నవంబర్ 2026 లో పునరుద్ధరించాలని దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఆమె లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ బిజినెస్ డెవలప్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం వల్ల, ప్రధానంగా ఐటీ కన్సల్టెన్సీ , సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ (IT Consultancy & Software) రంగంలో ఈ వ్యాపారాన్ని నిర్వహించారు. గతంలో లండన్‌లో బ్రాండెడ్ దుస్తుల వ్యాపారాన్ని కూడా నిర్వహించినట్లు ప్రచారం ఉంది.
దానికి సంబంధించిన ఖచ్చితమైన అధికారిక రికార్డులు తక్కువగా ఉన్నాయి. ఇటీవల నవంబర్ 2026 లో ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన రూ. 7 కోట్ల ఉద్యోగాల మోసం ఆరోపణల వల్ల కోట రుక్మిణి తో పాటు తను స్థాపించిన లండన్ కంపెనీ పేరు వార్తల్లో నిలిచింది. కోట రుక్మిణికి చెందిన మంగళగిరి కన్సల్టెన్సీ , లండన్ కంపెనీ ద్వారా భారీ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆపై తనపై , జరిపిన లావవాదేవీలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొందరు వ్యక్తులు తన పేరును, జనసేన పార్టీ పేరును వాడుకుని నిరుద్యోగులను మోసం చేశారని కోట రుక్మిణి ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ లండన్ కు వెళ్లిన సమయంలో కోట పరిచయం అయ్యింది. ఆ తర్వాత తను పార్టీలో కీలక వ్యక్తిగా మారింది.