వాషింగ్టన్ : ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన టైమ్ మ్యాగజైన్ కీలక ప్రకటన చేసింది. భారత దేశ భవిష్యత్తును మార్చే 100 మంది వ్యక్తులను ఎంపిక చేసింది. వారిలో తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ డైరెక్టర్ పా రంజిత్ ను కూడా చేర్చింది. దీంతో ఆయన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. ఈ సందర్బంగా టైమ్ ఆయన గురించి ఇలా వ్యాఖ్యానించింది. ప్రధాన స్రవంతి సినిమాలలో కుల వ్యతిరేక రాజకీయాలను, సామాజిక వాస్తవాలను సహజసిద్ధంగా అల్లగలిగే పా రంజిత్ సామర్థ్యం, అతన్ని భారతదేశంలో పనిచేస్తున్న అత్యుత్తమ చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిలబెట్టింది. అతని సినిమాలు ఎప్పుడూ కేవలం హీరో గురించే ఉండవు. అవి సమాజాలు, సంస్కృతుల సంక్లిష్టతలను ఆవిష్కరిస్తాయి. ప్రతి పాత్రను చాలా ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దారు. సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు అతను అతి చిన్న వివరాలపై కూడా చాలా శ్రద్ధ పెడతాడు, ఇది వాటికి ఎంతో సహజత్వాన్ని ఇస్తుంది.
‘సర్పట్ట పరంపరై’ చిత్రంలో అతనితో కలిసి పని చేయడం ఎంతో సంతృప్తినిచ్చే అనుభవం అని అందులో నటించిన వారు పేర్కొనడం తనకున్న పేషన్ ను తెలియ చేస్తుంది. కుల గుర్తింపు, శ్రామిక వర్గ గౌరవం కోసం జరిగే పోరాటాన్ని స్పృశిస్తూనే, 1970ల నాటి ఉత్తర చెన్నై బాక్సింగ్ సంస్కృతిని అతను పరిపూర్ణంగా తెరపైకి తీసుకు రాగలిగాడు. ప్రస్తుతం రెండవ భాగాన్ని చిత్రీకరించే పనిలో ఉన్నాడు పా రంజిత్ . ఒక వ్యక్తిగా అతను అసాధారణంగా వినయశీలి, కష్టపడి పనిచేసేవాడు. వారి హోదా లేదా పాత్రతో సంబంధం లేకుండా అతను ప్రతి ఒక్కరినీ ఒకే గౌరవంతో చూస్తాడు. ఇది అతని సినిమాల గురించి చెప్పినంతగా అతని వ్యక్తిత్వం గురించి కూడా చెబుతుంది. ఇక పా రంజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను దర్శకుడు, కథా రచయిత, నిర్మాత. సామాజిక అసమానతలు, కుల వివక్ష, అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలను తన సినిమాల ద్వారా బలంగా ప్రస్తావించే దర్శకుడిగా గుర్తింపు పొందారు. నీలం ప్రొడక్షన్ ను స్వంతంగా స్థాపించాడు. 2012లో అట్టకత్తి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 2014లో వచ్చిన మద్రాస్ సినిమాతో మంచి గుర్తింపు పొందారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి తీశాడు. ఇదే తలైవాతో కాలా తీసి ఔరా అనిపించేలా చేశాడు. 2021ల సార్పట్ట, 2022లో నచ్చత్తిరం నగర్‌గిరదు, 2024లో తంగలాన్ తీశాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసంది.
తను స్థాపించిన నీలం ప్రొడక్షన్స్ ద్వారా కొత్త దర్శకులు, సామాజిక ఇతివృత్తాలతో కూడిన సినిమాలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. నీలం కల్చరల్ సెంటర్ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం తన కళా రూపాల ద్వారా గళమెత్తుతున్నారు. క్యాస్ట్లెస్ కలెక్టివ్ అనే సంగీత బృందం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు పా రంజిత్. సినిమా కేవలం వినోద సాధనం మాత్రమే కాదని, సమాజంలోని సమస్యలను ప్రశ్నించే శక్తివంతమైన మాధ్యమమని ఆయన నమ్ముతారు .
