అమరావతి : కాకినాడ జిల్లా ఏటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ఉప్పాడ–తుని తీరంలోని కృష్ణపురం సమీపంలో, తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఇంజిన్ వైఫల్యం కారణంగా చిక్కుకు పోయారు. ప్రస్తుతం వారు సురక్షితంగా ఉన్నారని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్ , నౌకాదళాన్ని అప్రమత్తం చేసిన అధికారుల తక్షణ స్పందన అభినందనీయం అన్నారు ఈ సందర్బంగా. నీటి లోతు తక్కువగా ఉండటంతో, మరొక పడవ సహాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇక, కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు అదృశ్యమైన ఘటనపై ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందని చెప్పారు అచ్చెన్నాయుడు. కోస్ట్ గార్డ్, నౌకాదళం , ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, వారిని కనుగొనేందుకు యుద్ధ ప్రాతిపదికన విస్తృత గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అదృశ్యమైన మత్స్యకారులను రక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ రాయడంతో పాటు, కేంద్రం సహకారంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశామన్నారు. వారు బంగ్లాదేశ్ లేదా మయన్మార్ జలాల్లో ఉండే అవకాశం ఉందేమోనని, ఆ దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకారుల ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అదృశ్యమైన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు అచ్చెన్నాయుడు.; బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు .
