వ్య‌వ‌సాయ పెట్టుబ‌డుల‌కు తెలంగాణ గమ్య‌స్థానం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు

హైద‌రాబాద్ : వ్యవసాయం, ఎరువులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ప్రపంచ స్థాయి వ్యవసాయ పెట్టుబడులకు తెలంగాణను ఒక ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో వ్యవసాయం, ఎరువులు, ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల కార్యనిర్వాహక మండలి ప్రారంభ సమావేశానికి మంత్రి ఈరోజు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి వ్యవసాయ ఉత్పాదకాలు, ఎరువుల తయారీదారులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు, ఆహార ఉత్పత్తుల బ్రాండ్లు, పరిశోధనా సంస్థలు, అభివృద్ధి భాగస్వాముల ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఈ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మించు కోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సాధించడంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

రాష్ట్రంలో ఉన్న విస్తారమైన పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములవ్వాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వ్యవసాయం, ఎరువులు, వ్యవసాయ ఉత్పాదనలు, ఆహార శుద్ధి, ఎఫ్‌ఎంసీజీ (FMCG) రంగాలను అనుసంధానించడం ద్వారా రైతుల నుండి వినియోగదారుల వరకు సమీకృత విలువ గొలుసులను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హెచ్‌ఏసీఏ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, విత్తన ధృవీకరణ అథారిటీ డైరెక్టర్ కిరణ్ కుమార్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ సుష్మా, పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

Leave A Reply

Your Email Id will not be published!