మెగాస్టార్ చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమో సెన్సేష‌న్

సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో నెట్ ఫ్లిక్స్ లో త్వ‌ర‌లో మెగా వ‌ర్స్ టాక్ షో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జ‌రుగుతున్న ప్ర‌చారం విస్తు పోయేలా చేసింది. న‌గ‌రమంత‌టా మెగాస్టార్ మేనియా క‌నిపిస్తోంది. హైదరాబాద్ వీధుల్లో ఆ హోర్డింగ్స్ చూసి మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఒకటే మిస్టరీ. దశాబ్దాలుగా వెండితెరను ఏలిన మెగాస్టార్ చిరంజీవి పేరులో.. సడెన్‌గా ఒక ఇంగ్లిష్ అక్షరం ఎందుకు మాయమైంది? అది పొరపాటా లేక దీని వెనుక ఏదైనా భారీ ప్లాన్ ఉందా? అభిమానుల ఉత్కంఠకు తెర దించుతూ తాజాగా విడుదలైన ఆ స్పెషల్ ప్రోమో ఇప్పుడు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఓటీటీ వేదికపై హోస్ట్‌గా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘చిరంజీవీస్ మెగావర్స్’ పేరుతో ఓ క్రేజీ సెలబ్రిటీ టాక్ షో రాబోతోంది. అయితే ఈ షో అనౌన్స్‌మెంట్‌కు ముందు హైదరాబాద్ నగరంలో వెలిసిన ప్రమోషనల్ హోర్డింగ్స్ అందరినీ ఆశ్చర్య పరిచాయి.

ఆ పోస్టర్లలో చిరంజీవి పేరులోని ‘N’ అక్షరం కనిపించక పోవడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు చిరు పేరులో ‘N’ ఎందుకు మిస్ అయిందంటూ అభిమానులు రకరకాల ఊహాగానాలు మొదలు పెట్టారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ఒక నిమిషం నాలుగు సెకన్ల స్పెషల్ ప్రోమోతో ఆ మిస్టరీకి తెరపడింది. “అదేంటి.. చిరు పేరులో N లేదు” అంటూ సాగే ఆసక్తికరమైన పాటతో ఈ ప్రోమో మొదలవుతుంది. ఆటోలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. చివర్లో ఆ మిస్సింగ్ ‘N’ అంటే నెట్‌ఫ్లిక్స్ అని రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అంతేకాదు “ఇది నా అడ్డా” అంటూ చిరు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మెగా నాస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు అన్నీ ఒకే చోట ఉండబో తున్నాయంటూ నెట్‌ఫ్లిక్స్ ఈ వీడియోను షేర్ చేసింది.

ఇప్పటికే ఈ టాక్ షోకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా పలు ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. ఇందులో కమల్ హాసన్, ప్రభాస్, నాగార్జున, రవితేజ, నాని, బ్రహ్మానందం, సందీప్ రెడ్డి వంగా, బాబీ కొల్లి వంటి స్టార్ సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా విశేషాలతో పాటు తన 48 ఏళ్ల సినీ ప్రయాణంలోని ఆసక్తికర జ్ఞాపకాలను చిరు ఇందులో పంచుకోనున్నారు. ప్రోమోతో అంచనాలను ఆకాశానికి చేర్చిన నెట్‌ఫ్లిక్స్.. అసలైన స్ట్రీమింగ్ తేదీ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. ఈ నెల 30న హైదరాబాద్‌లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి, అదే రోజు ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవైపు ‘విశ్వంభర’, బాబీ దర్శకత్వంలో ‘కాకా’ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు డిజిటల్ తెరపై హోస్ట్‌గా మెగాస్టార్ కొత్త అవతారం ఎత్తడం అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి. మరి ‘మెగావర్స్’ అడ్డాలో బాస్ చేసే సందడి ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your Email Id will not be published!