శ్రీవారి పడి సారె ఊరేగింపు ట్రయల్ రన్ విజయవంతం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలి
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమి తీర్థానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి తిరుచానూరుకు శ్రీవారి పడి సారెను తీసుకువచ్చే ఊరేగింపు మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్‌లో అధికారులతో సమావేశమై బ్రహ్మోత్సవాలు, పంచమితీర్థం ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి తరఫున తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారికి సమర్పించే పడి సారె మన ప్రాచీన ధార్మిక సంప్రదాయాలకు, తిరుమల–తిరుచానూరు ఆలయాల మధ్య ఉన్న పవిత్ర అనుబంధానికి ప్రతీక అని తెలిపారు. ఈ అపురూపమైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న శ్రీ వినాయక స్వామివారి ఆలయం నుంచి శ్రీవారి పడి సారె ఊరేగింపు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఏనుగుపై సారెను తీసుకువెళుతూ శ్రీ కోదండ రామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజూర్ కార్యాలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్టీసీ బస్టాండ్, పద్మావతిపురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, గోశాల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్, డిప్యూటీ ఈవోలు హరేంద్రనాథ్, శాంతి, శివప్రసాద్, విజివో , అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
