బీమా ప్రీమియం చెల్లింపులకు రూ.3 వేల కోట్లతో కార్యాచరణ

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి : రాష్ట్రంలో పంటల బీమా అమలు, ఇన్‌పుట్ సబ్సిడీపై వాస్తవాలను విస్మరించి రైతులను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధిష్టానం తప్పుడు ప్రచారం చేయటం సరికాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం, ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఖరీఫ్‌–2025తో పోలిస్తే ఖరీఫ్‌–2026లో పంటల బీమా నమోదులు రెట్టింపునకు పైగా పెరగడమే ప్రభుత్వ చర్యలకు నిదర్శనమన్నారు. ఖరీఫ్‌–2026లో రాష్ట్రవ్యాప్తంగా సాగైన 31.01 లక్షల హెక్టార్లలో 17.07 లక్షల హెక్టార్లు, అంటే సుమారు 42 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకి వచ్చాయని మంత్రి తెలిపారు. మొత్తం సాగు విస్తీర్ణంలో 55.05 శాతం బీమా కవరేజీ సాధించామని, బీమా చేసిన విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆరో స్థానంలో నిలిచిందని వెల్ల‌డించారు. ఖరీఫ్‌–2025లో 18.88 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఖరీఫ్‌–2026లో 44.09 లక్షలకు పెరిగి 2.3 రెట్ల వృద్ధి నమోదైందన్నారు. రుణం పొందని రైతుల దరఖాస్తులు 2.00 లక్షల నుంచి 25.27 లక్షలకు పెరిగి 12.6 రెట్ల వృద్ధి సాధించాయని తెలిపారు. బీమా విస్తీర్ణం 7.67 లక్షల హెక్టార్ల నుంచి 17.07 లక్షల హెక్టార్లకు పెరిగి 2.2 రెట్ల వృద్ధి సాధించగా, బీమాలో చేరిన రైతుల సంఖ్య 7.43 లక్షల నుంచి 17.10 లక్షలకు పెరిగి 2.3 రెట్ల వృద్ధి నమోదైందన్నారు. స్వచ్ఛంద నమోదు విధానానికి రైతుల నుంచి లభిస్తున్న స్పందనకు ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. నమోదు గడువు పొడిగింపు, 2026 జూలై 29 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక ఇంటింటి ప్రచార కార్యక్రమాలు, రైతు సేవా కేంద్రాల వారీ పర్యవేక్షణ ఇందుకు దోహదపడ్డాయని వివరించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంటల బీమా ప్రీమియం బకాయిలు పేరుకుపోవడం వల్లే రైతులకు బీమా పరిహారం అందడంలో ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి, పెండింగ్ ప్రీమియం బకాయిలను విడతలవారీగా చెల్లించే కార్యాచరణకు ఆమోదం సాధించామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు మార్గం సుగమమైందన్నారు అచ్చెన్నాయుడు. ఇందులో భాగంగా 2026–27లో రూ.500 కోట్లు, 2027–28లో రూ.1,000 కోట్లు, 2028–29లో రూ.1,500 కోట్లు చొప్పున మొత్తం రూ.3,000 కోట్లు చెల్లించే ప్రతిపాదనకు భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర వాటా అందిన వెంటనే పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం బీమా కంపెనీలను ఆదేశించిందని వెల్లడించారు. వైసీపీ పాలనలో చేసిన తప్పుల భారం రైతులపై పడకుండా సరిదిద్దుతున్నాం. గొడ్డలిపార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ముందుగా తన ప్రభుత్వ హయాంలో పేరుకు పోయిన బకాయిల సంగతిని గుర్తుంచుకోవాలి. మీరు సృష్టించిన సమస్యలను మేము పరిష్కరిస్తూ రైతులకు మేలు చేస్తున్నాం. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!