Lata Kabhi Kabhie : ఎన్ని సార్లు విన్నా గుండెల్లో ఏదో వెలితి..ఒకటా ..రెండా..వందలా ..కాదు..వేలసార్లకు చేరుకుంది ..ఈ పాట విన్నప్పుడల్లా..శ్రీలంక రేడియో స్టేషన్ లో కభీ కభీ మేరే దిల్ మే ..ఖయాల్ ఆథా హై..అంటూ మంద్ర స్వరంలో వినిపించేది.
పైన చంద్రుడు..మధ్యలో వెన్నెల..నిర్మలమైన ఆకాశం..ముఖేష్ ..లతా మంగేష్కర్(Lata Kabhi Kabhie) గొంతులోంచి జాలు వారుతుంటే ..గుండె ఆగిపోతుందేమోనన్న ఆందోళన.
అయినా ఏమిటీ ఇంతటి మహత్తు ఉంటుందా ..ఏమో తెలియదు..ఊహ తెలిసినప్పటి నుంచి పాటలన్నా..కన్నీళ్లు నిండిన కవిత్వమంటే చచ్చేంత ఇష్టం..వాటిపై అమలిన ప్రేమ..ఎడతెగని ఇష్టం కూడా.
జీవితమంటే ఆస్తులు..అంతస్తులు..నోట్ల కట్టలు..హోదాలు..పదవులు కాదు..గుప్పెడంత ప్రేమ కావాలి.
హృదయానికి తోడు లేక పోతే..మనసును వెలిగించే ధూపం లేకపోతే ఎట్ల.
తుజే జమీపే అంటూ లత మార్దవమైన గొంతుతో ఆలాపిస్తుంటే..ఆకలి ఎట్లా అవుతుంది..
ఏముందిఆ స్వరంలో ..దేవుడు ముందే అమర్చి పంపించాడా అనిపించింది.
అప్పట్లో రాజేష్ ఖన్నా పిచ్చి..ఎంతంటే..గుండెలో పట్టలేనంత అభిమానం. వ్యామోహం కూడా.
హమ్ దోనో..దో ప్రేమీ అంటూ జీనత్ అమన్ తో కలిసి ..రైలు వెళుతుంటే ..ఓహ్ ..అలా ఎగరిపోతే ఎంత బావుండేదని అనిపించేది.
అప్పుడు ఇప్పుడున్నంత వెసలుబాటు లేదు. లివింగ్ లెజెండ్, ఎవర్ గ్రీన్ హీరో ..కోట్లాది భారతీయుల ఆరాధ్యుడు..జనం మెచ్చిన నటుడు అమితాబ్ బచ్చన్ గొంతులోంచి కభీ కభీ అంటూ వుంటే..జీవితం ధన్యమై పోయిందని అనిపించింది.
అలా వింటూ వింటూ వుంటే ముఖేష్ నా ఇష్టమైన గాయకుల జాబితాలో చేరిపోయాడు. మరో వైపు లేతతనపు మాధుర్యాన్ని గొంతులో ఒలికించి ..పాటల తోటల్లో విహరించేలా చేసే గాయకుల్లో కిషోర్ కుమార్ , ఎస్పీబీ కూడా ఉన్నారు.
ఇక కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆథాయై అన్న పాటను వేలాది మంది రింగ్ టోన్స్గా పెట్టేసుకున్నారు. నువ్వు లేవు..నీ జ్ఞాపకాల రాతిరిలో నేను ఒంటరిగా నిల్చున్నా. నీతో పాటు కలిసి నడిచిన అడుగులు ..నిశ్శబ్దమై నన్ను వాటేసుకుంటున్నాయి.
గుండె లయబద్దమై పోయింది. హృదయంలో మెల్లగా కదులుతోంది..సన్నగా..మంద్రమై ..సితార మీటినట్లు..చీకటి గదిని కమ్ముకున్నట్లు..గాలి స్తంభించినట్టు..అనిపించింది.
కభీ కభీ మేరే దిల్ మే ..ఖయాల్ ఆథా హై..అంటూ ముఖేష్, లతాజీ..అమితాబ్ ల గొంతులన్నీ కలగలిపి ఒక్కొక్కటిగా వస్తూ వుంటే..ప్రపంచాన్ని జయించినంత సంతోషం.
ఆ గాత్రం ఇప్పుడు లేదు. కానీ ఆ మధురమైన స్వర మాధురమై వినిపిస్తూనే ఉంటుంది. నిద్ర నుంచి తట్టి లేపుతూనే ఉంటుంది.
Also Read : గాత్ర మాధుర్యం అజరామరం