హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఏడు జిల్లాలను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల్లో ప్రమాదాల కారణాలను విశ్లేషించి, మరణాలను తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై డీజీపీ సీవీ ఆనంద్ , రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి సంయుక్తంగా డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సేఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఎంపిక చేసిన ఏడు జిల్లాల కలెక్టర్లు, నాలుగు పోలీస్ కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు, సంబంధిత యూనిట్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు..
ప్రతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలు, ఏ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మార్గదర్శక్ పోర్టల్, డ్యాష్‌బోర్డులో నమోదు చేయాలని డీజీపీ సూచించారు. అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా సుమారు 1.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. తెలంగాణలో ఏటా సుమారు 7 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల మరణాల్లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉందన్నారు.
