పెట్టుబడులకు స్వ‌ర్గ‌ధామం ఆంధ్రప్రదేశ్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్

జాతి కోసం, దేశం కోసం పారిశ్రామికవేత్తలు ఆలోచించాలి

అమ‌రావ‌తి : గత ప్రభుత్వంలో పా రిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేద‌ని కానీ తాము వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాష్ట్రంలో మీరు పరిశ్రమ పెడితే.. మాకేమిస్తారు..? అని అడిగే విష సంస్క్రతి అప్పట్లో ఉండేది. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు రాష్ట్రాన్ని స్వర్గధామంగా మారుస్తోందన్నారు. మీరు పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి ఏం ఇస్తారు..? ప్రజలకు ఏం చేస్తారు అని అడిగి సత్సంప్రదాయంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. పరిశ్రమలకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని చెప్పారు. వాటిని అందిపుచ్చుకొని, ఆంధ్రప్రదేశ్ పురోగతిలో పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాకినాడ జేఎన్టీయూలో సోమవారం జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సుకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్రాంత ఉద్యోగుల ప్యారడైజ్ నగరంగా భావించే కాకినాడలో తొలిసారి సీఐఐ ప్రాంతీయ సదస్సు జరగడం ఆనందంగా ఉంద‌న్నారు. విశాఖపట్నం తర్వాత రాష్ట్రంలో రెండో ప్రాంతీయ సదస్సుకు కాకినాడ వేదిక కావడం గొప్ప మైలురాయిగా పేర్కొన్నారు. కాకినాడ పారిశ్రామిక ప్రగతి చరిత్రలో రూ.6,347 కోట్ల పెట్టుబడులు రావడం కొత్త అవకాశాలకు పునాది వేస్తుందన్నారు.

ఈ ప్రాంతం మరింత పురోగతి చెందడానికి ఇది ఇంధనంగా పని చేస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. 16 ఎంఓయూల ద్వారా రూ.4,652 కోట్లు పెట్టుబడులు, రూ.2,090 కోట్లతో పూర్తయిన 4 ప్రత్యేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగడం శుభ సూచకం అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో 18 వేల మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. ఇది యువతకు ఉపాధి భరోసాను ఇవ్వడంతో పాటు ఎన్నో కుటుంబాలకు ఓ ఆసరాను చూపించే గొప్ప కార్యక్రమంగా నిలిచి పోతుందన్నారు. 1965 ప్రాంతంలో సింగపూర్ అనే దేశం అత్యంత పేద దేశం. కనీస అవసరాలు తీర్చుకోవడానికి, దేశం ముందుకు వెళ్లడానికి సరైన అవకాశాలు లేని స్థితి నుంచి తన అభివృద్ధి ప్రయాణాన్ని మొదలు పెట్టిందన్నారు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ సంకల్ప బలంతో, సమష్టి కృషితో ఈనాటి ప్రపంచంలో అద్భుతమైన దేశంగా మారిందన్నారు డిప్యూటీ సీఎం. స్విట్జర్లాండ్ దేశ నమూనా కూడా అలాంటిదే. మనలో స్పష్టత, ఐక్యత, జాతీయత ఉంటే కచ్చితంగా దేశాన్ని పురోగమన దిశగా ముందుకు తీసుకెళ్లవచ్చు అని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు, వారిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your Email Id will not be published!