న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రూ. 407.56 కోట్ల విలువైన బనాస్ డెయిరీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రెండు బయో-సీఎన్జీ ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి, అసెంబ్లీ స్పీకర్ మరియు బనాస్ డెయిరీ చైర్మన్ శంకర్ చౌదరి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 30, 31 తేదీలలో గుజరాత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు బనాస్ డెయిరీ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే థరాద్, రాధన్పూర్లలో రెండు బయో-సీఎన్జీ ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభించనున్న ప్రాజెక్టులలో భిల్ది వద్ద రూ. 324.77 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘భారత్ బోవిన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్’ , సనదార్ వద్ద రూ. 51.65 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రాసెసింగ్ ప్లాంట్, పాలన్పూర్లో రూ. 31.14 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘ఆటోమేటెడ్ స్టోరేజ్ అండ్ రిట్రీవల్ సిస్టమ్’ ఉన్నాయి.
వీటిలో చివరి రెండు ప్రాజెక్టులను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. 127 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బీబీఆర్సీ, పశువుల ప్రజననం కోసం ఒక అత్యుత్తమ కేంద్రంగా పని చేస్తుంది. ఇది జన్యుపరమైన మెరుగుదల , ఆవిష్కరణలపై దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కింద ఈ కేంద్రానికి రూ. 38.83 కోట్లు మంజూరయ్యాయి. ఈ కేంద్రానికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ నుండి సాంకేతిక సహకారం కూడా అందుతోంది. ఈ ప్రాజెక్టుకు పశు సంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి పథకం కింద ఆమోదం లభించింది. దీనికి నాబార్డ్ ఆర్థికంగా మద్దతు ఇస్తోంది. పాలన్పూర్లోని ఏఎస్ఆర్ఎస్ కేంద్రాన్ని, అత్యధిక ఉష్ణోగ్రత గల పాల ఉత్పత్తులను ఆటోమేటెడ్ పద్ధతిలో నిల్వ చేయడానికి , రవాణా చేయడానికి బనాస్ డెయిరీ అభివృద్ధి చేసింది. దీని తొమ్మిది అంచెల స్టీల్-ర్యాక్ వ్యవస్థలో 11,000 ప్యాలెట్లు పట్టగలవు . ఇది గిడ్డంగి కార్యకలాపాల వేగం, గుర్తించగల సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి రూపొందించబడింది.
