స్వ‌తంత్ర భార‌తీయ కంపెనీగా సీఎంఎఫ్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఈఓ కార్ల్ పీ

న్యూఢిల్లీ : ‘నథింగ్’ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్‌ సరసమైన ధర , మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి దేశం నుండి సీఎంఎఫ్ ని అంతర్జాతీయ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ‘నథింగ్’ సంస్థ తన అనుబంధ సంస్థ సీఎంఎఫ్‌ని ఒక స్వతంత్ర భారతీయ కంపెనీగా వేరు చేయనున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వ‌న్ ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ సహ-వ్యవస్థాపకుడైననథింగ్ సీఈఓ కార్ల్ పీ మాట్లాడుతూ సీఎంఎఫ్‌ ఇకపై కేవలం ఒక ఉత్పత్తి శ్రేణిగా మాత్రమే పరిమితం కాకుండా, మెజారిటీ భారతీయ వాటాదారులతో భారతదేశంలోనే ఒక స్వతంత్ర కంపెనీగా నమోదు కానుందని స్పష్టం చేశారు. నేను భారతీయుడిని కాదు. నేను స్వీడన్ దేశస్థుడిని, చైనాలో ఎనిమిది సంవత్సరాలు గడిపి లండన్ నుండి ఒక కంపెనీని నడుపుతున్నాను. కాబట్టి దీనిపై నాకు ఎందుకు అంత ఆసక్తి ఉందో స్పష్టంగా చెబుతాను.

దీనికి ఏమి అవసరమో నాకు తెలుసు. అవసరమైన అంశాలను మేము ఇప్పటికే సిద్ధం చేశాము. ఇందులో తాము భారతదేశానికి భాగస్వామిగా ఉండగలమని భావిస్తున్నామని పేర్కొన్నాడు. అందుకే తాము సీఎంఎఫ్ ని ‘నథింగ్’ నుండి వేరు చేసి స్వతంత్ర భారతీయ కంపెనీగా మారుస్తున్నామని ప్ర‌క‌టించారు. దీనిలో మెజారిటీ వాటా భారతీయులదే ఉంటుందన్నారు. ప్రధాన కార్యాలయం భారతదేశంలోనే ఉంటుంది . ఇక్కడే సొంత బృందం, పరిశోధన , అభివృద్ధి విభాగాలు ఉంటాయి అని వెల్ల‌డించారు కార్ల్ పి. త‌ను 2020లో వ‌న్ ప్ల‌స్ నుండి వైదొలిగి ‘నథింగ్’ అనే స్మార్ట్ పరికరాల బ్రాండ్‌ను స్థాపించారు. “‘నథింగ్’ ఒక వాటాదారుగా, భాగస్వామిగా కొనసాగుతుంది. సీఎంఎఫ్‌ మాత్రం భారతీయ కంపెనీగా మారుతుంది అని ఆయన చెప్పారు.

సెప్టెంబర్ 2025లో పీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి సీఎంఎఫ్ ని భారతదేశంలో ప్రధాన కార్యాలయంతో కూడిన అనుబంధ సంస్థగా స్థాపించే ప్రణాళికల గురించి చర్చించారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న న‌థింగ్, సీఎంఎఫ్ ఉత్పత్తులకు భారతదేశాన్ని ప్రపంచ స్థాయి ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు, భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్’ తో ఒక సంవత్సరం క్రితం ఉమ్మడి తయారీ ఒప్పందాన్ని కూడా ప్రకటించింది. ప్రపంచ మార్కెట్లో పోటీపడగల స్థానిక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను నిర్మించడానికి పెట్టుబడి పెట్టేందుకు మొబైల్ ఫోన్ తయారీ పథకం కింద భారత ప్రభుత్వం ఒక నిబంధనను ప్రకటించిన నేపథ్యంలో త‌న‌ నుండి ఈ తాజా బ్లాగ్ వచ్చింది.

Leave A Reply

Your Email Id will not be published!