ముంబై : పేటేం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్వదేశీ ఏఐ తయారీదారులకు ఆర్థిక మద్దతు ప్రకటించారు. “మాతో వచ్చి చేరండి లేదా మీ స్వంత ఏఐని రూపొందించుకోండి .. నా నుండి నిధులు పొందండి అని ఆయన పేర్కొన్నారు. స్వంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను రూపొందించే భారతీయ పారిశ్రామికవేత్తలకు తన సొంత డబ్బుతో మద్దతు ఇస్తానని ప్రకటించారు. బెంగళూరులో జరిగిన ‘Cypher 2026’ AI సదస్సులో మాట్లాడారు. , ఈ సవాలును స్వీకరించే వ్యవస్థాపకులకు రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు చెక్కులు ఇస్తానని శర్మ తెలిపారు. భారతదేశపు ఏఐ స్టార్టప్ రంగంలో “సొంత నమూనాలను రూపొందించాలా లేక ఇతరుల నమూనాలపై ఆధారపడి నిర్మించాలా అనే చర్చ జరుగుతుండగా దేశంలోని ప్రముఖ టెక్ వ్యవస్థాపకులలో ఒకరైన శర్మ నుండి వచ్చిన ఈ ప్రతిపాదన ఒక వ్యక్తిగత హామీగా మారింది.
పే టీమ్ ఒక లిస్టెడ్ కంపెనీ (స్టాక్ మార్కెట్‌లో నమోదైన సంస్థ కాబట్టి, కంపెనీ నిధులను ఇలాంటి ప్రయత్నాలకు కేటాయించలేనని శర్మ పేర్కొన్నారు. అయితే, వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేయడానికి పే టీఎం విస్తృత పంపిణీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని మాత్రం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. క్యూ ఆర్ కోడ్‌లు , సౌండ్‌బాక్స్ ద్వారా భారతదేశంలోని దుకాణాల వద్దకు మొబైల్ చెల్లింపుల విధానాన్ని తీసుకు వచ్చిన తన అనుభవాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. చెల్లింపుల రంగంలో భారతదేశం ప్రపంచ స్థాయి ప్రమాణంగా మారుతుందని తాను ఏళ్ల క్రితమే అంచనా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ అంచనా నిజమైందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఏఐ రంగంలో కూడా అటువంటి లక్ష్యాన్ని సాధించాలని విజయ్ శేఖర్ శర్మ పిలుపునిచ్చారు.
