టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ వెస్టిండీస్ ఇంటికి

చుక్క‌లు చూపించిన కేర‌ళ స్టార్ సంజు శాంస‌న్

కోల్ క‌తా : అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. త‌ను ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. ప‌రుగుల కంటే త‌న‌కు దేశం ముఖ్య‌మ‌ని, జెర్సీ ధ‌రించ‌డం త‌న‌కు ఎన‌లేని బ‌లాన్ని ఇస్తుంద‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించాడు. అందుకు అనుగుణంగానే సెంచ‌రీ కోసం కేవ‌లం 3 ప‌రుగుల దూరంలో ఉన్నా దాని వైపు ఫోక‌స్ పెట్ట‌లేదు. ద‌గ్గ‌రుండి తాను చివ‌రి వ‌ర‌కు నిలిచి భార‌త జ‌ట్టుకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని క‌ట్ట‌బెట్ట‌డంలో ముఖ్య భూమిక పోషించాడు. ఒక వైపు వికెట్లు రాలుతున్నా ఇంకో వైపు టార్గెట్ ఒత్తిడి ఉన్నా ఎక్క‌డా తొట్రుపాటుకు గురి కాలేదు సంజూ శాంస‌న్. త‌న 10 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఇదే అత్యుత్త‌మ‌మైన ఇన్నింగ్స్ ఆడానంటూ పేర్కొన్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో డూ ఆర్ డై పొజిష‌న్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కోల్ క‌తా ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 195 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది. అనంత‌రం 196 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు రెండు కీల‌క‌మైన వికెట్లు కోల్పోయింది. మైదానంలోనే ఉన్న శాంస‌న్ సూర్య కుమార్ యాద‌వ్ తో క‌లిసి బ‌ల‌మైన పునాది వేశాడు. ఆ త‌ర్వాత తిల‌క్ వ‌ర్మ‌, పాండ్యాతో మెరుగైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. చివ‌ర‌కు తాను కేవ‌లం 50 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 12 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. విండీస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. ఇండియాను సెమీ ఫైన‌ల్ కు చేర్చాడు.

Leave A Reply

Your Email Id will not be published!