#KashmiriChicken : కాశ్మీర్ చికెన్ ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

కాశ్మీర్ లో ప్రకృతి మాత్రమే కాదు అక్కడి రుచులు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

Kashmiri Chicken : ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షించే పర్యాటక ప్రదేశాల్లో కాశ్మీర్ ఒకటి. కాశ్మీర్ లో ప్రకృతి మాత్రమే కాదు అక్కడి రుచులు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇప్పుడు మనం కాశ్మీరీ చికెన్ తయారు చేసుకోబోతున్నాం. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు :

చికెన్‌ – 1/2 కిలో
ఉల్లిపాయ ముక్కలు – 2 కప్పులు
అల్లం వెల్లుల్లి – 2 స్పూన్స్
ఎండు మిర్చి – 2
కశ్మీరీ కారం – 1 1/2 స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1/3 స్పూన్
యాలకులు – 3
దాల్చిన చెక్క – చిన్న ముక్క
జీడిపప్పు – 6
బాదం – 6
పెరుగు – 1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడ
నూనె – 5 స్పూన్స్
కొత్తిమీర తరుగు – 1/2 కప్పు

తయారుచేయు విధానం :

ముందుగా చికెన్‌ ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేయించి దంచి కాశ్మీరీ కారంలో వేసి కలపాలి. అలాగే జీడిపప్పు, బాదం పప్పులు కూడా సన్నని సెగ మీద దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేగాక అందులో చికెన్‌ ముక్కలు వేసి సన్న మంటపై 5 నిమిషాలు ఉంచాలి.

తర్వాత తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి, ఉప్పు వేసి మరో 2 నిమిషాలు వేయించి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఉడుకుతున్న సమయంలో అందులో జీడిపప్పు, బాదం పొడి కలపాలి. ముక్క మెత్తబడగానే పెరుగు కలిపి సన్నని సెగమీద 5 నిమిషాలు ఉంచి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కశ్మీరీ చికెన్ రెడీ అయినట్లే. దీన్ని వేడివేడిగా రొట్టె, నాన్‌, బ్రెడ్‌తో తింటే ఎంతో బాగుంటుంది.

 

No comment allowed please