గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు : సీఎం

ఏపీలో ప్రాడెక్టు పర్ఫెక్షన్ క్లస్టర్లపై సమీక్ష

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సోమవారం ప్రాడెక్టు పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం ( భవ్య పథకం) కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్ధి పై సీఎం చర్చించారు. 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ సహా 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసే అంశంపై సమీక్షలో చర్చించారు.

పారిశ్రామిక పార్కుల్లో ప్రాడెక్టు పర్ఫెక్షన్ తో పాటు లాజిస్టిక్స్ ను కూడా అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్ హౌసింగ్ లాంటి మౌలిక సదుపాయాలు ఈ లాజిస్టిక్స్ పార్కులకు అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. ప్రత్యేకించి రవాణా వ్యయం తగ్గితే ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. పారిశ్రామిక క్లస్టర్లకు రైల్, రోడ్, పోర్టు కనెక్టివిటీ జరిగేలా లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ జరగాలని సూచనలు చేశారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు నాణ్యత పెరిగితేనే గ్లోబల్ స్థాయికి చేరుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉత్పత్తులకు స్థానికంగా, ప్రాంతీయంగా, దేశ, విదేశీ మార్కెట్లకు చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారయ్యేలా ప్రోత్సాహం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!