వరంగల్ జిల్లా : రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. విద్యుత్ సరఫరా అంతరాయాల నివారణకు టీజీఎన్‌పీడీసీఎల్‌లో హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ సేవలకు శ్రీకారం చుట్టారు .హనుమకొండ, నక్కలగుట్ట సెక్షన్ లోని బాలసముద్రంలో హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్‌ను ప్రారంభించారు. సంస్థ పరిధిలోని 18 సర్కిళ్లకు విస్తరణ జరుగుతుందన్నారు.
వర్షాకాలంలో వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు విద్యుత్ అంతరాయాలను వేగంగా పరిష్కరించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ కీలక చర్యలు చేపడుతోందని సంస్థ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం హనుమకొండ డివిజన్ పరిధిలోని ఈఫిల్ టవర్ సర్కిల్ లో హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ వాహనాన్ని సీఎండీ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టే ప్రీ-మాన్సూన్ నిర్వహణ పనులు విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత మెరుగు పరచడానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లను తాకడం వల్ల వర్షాలు, ఈదురు గాలుల సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయాలు అధికంగా సంభవిస్తాయని తెలిపారు. బకెట్ ల్యాడర్ వినియోగంతో చెట్ల కొమ్మలను సురక్షితంగా, వేగంగా కత్తిరించే అవకాశం ఉండటంతో విద్యుత్ అంతరాయాలను గణనీయంగా తగ్గించ వచ్చన్నారు.
అలాగే విద్యుత్ సిబ్బంది ఎత్తైన ప్రదేశాల్లో అత్యంత భద్రతతో పనిచేయడానికి ఈ బకెట్ ల్యాడర్ ఎంతో ఉపయోగ పడుతుందని, ప్రమాదాల నివారణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ప్రస్తుతం హనుమకొండలో ప్రారంభించిన హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్‌కు తోడు మరో మూడు రోజుల్లో వరంగల్‌లో మరో బకెట్ ల్యాడర్‌ను కూడా ప్రారంభించనున్నట్లు సీఎండీ వెల్లడించారు.
