న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఓట్లు తొలగించే అధికారం ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏఐసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిరసన కాదన్నారు. ఇది ఈ దేశ ప్రజల కోసం చేస్తున్న ఆందోళన అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి అమర వీరులు ఈ దేశం కోసం పోరాడి స్వాతంత్ర్యం తెచ్చారు. పేదలు, ధనికులు, అందరికీ సమాన ఓటు హక్కును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు. దీనివల్ల, సామాన్య ప్రజలకు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లభించిందని అన్నారు.
కానీ నరేంద్ర మోదీ , జ్ఞానేష్ కుమార్ కలిసి పేదల ఓటు హక్కును హరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సీఎం. కులం, ప్రాంతం , భాష పేరుతో ప్రజలను విభజించి నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ తమను రక్షించలేవని వారికి అర్థమైందని అన్నారు. అందుకే మోదీని ఓడించడానికి సిద్ధంగా ఉన్న దళితులు, ఆదివాసీలు, గిరిజనులు , మైనారిటీల ఓట్లను తొలగించడానికి వారు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. తాను మోదీ, సీఈసీని కేవలం ఒక్కటే అడుగుతున్నాను. దేశ జనాభా పెరుగుతోంది కదా మరి 13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? 2014లో 81 కోట్ల ఓట్లు ఉండేవి, 2019లో 91 కోట్లు, 2024 నాటికి 97 కోట్ల ఓట్లు ఉండాలి… మరి ఇప్పుడు వాటిని 13 కోట్లకు ఎలా తగ్గించారంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
జనాభా 140 కోట్లకు పెరిగినప్పుడు, ఓట్లు ఎలా తగ్గుతాయి? దీనికి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందేనని అన్నారు. అందుకే మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ నిరసన కాదు, కేవలం ‘ఇండియా’ కూటమి నిరసన కాదు… ఇది ఈ దేశంలోని పేద ప్రజల ఉద్యమం అని పేర్కొన్నారు. వెంటనే జ్ఞానేష్ కుమార్‌ను తొలగించండి, లేకపోతే మీరు అధికారాన్ని వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.