రూ. 12,073 కోట్ల హైదరాబాద్-విజయవాడ రహదారి విస్త‌ర‌ణ

ప్ర‌క‌ట‌న చేసిన రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి

హైద‌రాబాద్ : హైదరాబాద్-విజయవాడ రహదారి ఆరు లేన్ల విస్తరణకు సిద్ధం అయ్యింది. జాతీయ ర‌హ‌దారి -65 విస్త‌ర‌ణ‌కు రూ. 12, 073 కోట్లు కేటాయించారు. ఆరు ప్రధాన లేన్లు, రెండు సర్వీస్ లేన్ల ఏర్పాటుకు ప్రణాళిక త‌యారు చేయాల‌ని ఆదేశించారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఆర్ఆర్ఆర్ కోసం కొత్త టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభ‌మైన‌ట్లు తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం కారిడార్‌లోని జాతీయ రహదారి-65 ను ఆరు లేన్ల రహదారిగా, అదనంగా రెండు సర్వీస్ లేన్లతో విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్ల‌డించారు. నగరంలో త్వరలో జరగనున్న ‘ఇండియన్ రోడ్ కాంగ్రెస్’ సదస్సు ఏర్పాట్ల సమీక్ష సందర్భంగా ఈ విష‌యం తెలిపారు.

ఈ రహదారి ప్రాజెక్టు సాంకేతిక కమిటీ స్థాయి ప్రక్రియను పూర్తి చేసుకుందని, కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం కోసం వేచి చూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, తుది ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. రహదారిపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరుగుతుండటంతో, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) గుర్తించ బడ్డాయని తెలిపారు. ఈ విస్తరణ వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, రహదారి భద్రత మెరుగు పడుతుందని, కారిడార్ వెంబడి పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఆయన వివరించారు.

తెలంగాణకు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అయిన రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర విభాగం భూసేకరణ పూర్తయిందని వెంకట్ రెడ్డి తెలిపారు; 161.518 కిలోమీటర్ల ఈ మార్గం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి , చౌటుప్పల్ ప్రాంతాలను కలుపుతుందని చెప్పారు. గతంలో రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ, భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అవి రద్దయ్యాయని చెప్పారు మంత్రి. ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తయినందున, ప్రభుత్వం కొత్తగా టెండర్లను ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తోందన్నారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తయారీ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను శ్రీశైలంతో అనుసంధానించే జాతీయ రహదారి-765 వెంబడి, నల్లమల అటవీ ప్రాంతం మీదుగా మన్ననూర్ , శ్రీశైలం మధ్య ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!