అమరావతి : ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రూ. 10 కోట్లతో ఆధునీకరించిన పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార నిధులతో ఆధునీకరణ పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో విషయం సాధించిన తరువాత చేపట్టిన పర్యటనలో పవన్ కళ్యాణ్ దృష్టికి వాకపల్లి, ఇసుకపల్లి, నాగులాపల్లి, కొండెవరం, యు. కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంత ఆవాసాలకు చెందిన ప్రజలు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని, అరకొర నీటితో సరిపెట్టుకోవాల్సి వస్తోందన్న విషయాన్ని దృష్టికి తీసుకు వచ్చారు. ఆ సందర్భంలో నాగులాపల్లి మంచినీటి పథకాన్ని, వాకపల్లి చెరువును స్వయంగా పరిశీలించారు.
గతంలో నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకం నిర్మించినప్పుడు మనిషికి 40 లీటర్ల తాగునీటి సరఫరా లక్ష్యంగా నిర్ధారించారు. అయితే నిర్మాణం చేపట్టినప్పటితో పోలిస్తే ఆవాసాల సంఖ్య, ప్రజల సంఖ్య గణనీయంగా పెరగడంతో వారి అవసరాలకు సరిపడా తాగునీటి సరఫరా కష్టసాధ్యంగా మారింది. సమస్యను గుర్తించిన పవన్ కళ్యాణ్ జేజేఎం-అమరజీవి జలధార నిధులతో తక్షణం నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇంటేక్ వెల్ సామర్థ్యాన్ని పెంచేందుకు మూడు 20 హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేశారు. నవఖందరాడ నుంచి శుద్ధి చేయని నీటిని వాకపల్లి వరకు తరలించేందుకు 3.8 కిలోమీటర్ల మేర భారీ పైపు లైన్ వేశారు. నీటిని శుద్ధి చేసేందుకు రెండు మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు మూలపేట గ్రామంలో పాత పైపు లైన్ దెబ్బతినడంతో కొత్త పైపు లైన్ ఏర్పాటు చేశారు.
సంపులు, ట్యాంకులు మొత్తాన్ని పునరుద్ధరించి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేశారు. పిఠాపురం పర్యటనలో భాగంగా నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని సందర్శించి, ఆధునీకరించిన విభాగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆధునీకరణకు సంబంధించిన ఫోటో గ్యాలరీని వీక్షించారు. కొత్త వాటర్ పైప్ లైన్ మ్యాప్ ను పరిశీలించారు. యు. కొత్తపల్లి మండల పరిధిలోని 51 ఆవాసాలు, పిఠాపురం రూరల్ మండల పరిధిలోని ఒక ఆవాసానికి తాగునీటి కష్టాలు తీర్చారు. దాదాపు 97 వేల మందికి పైగా రోజుకు తలకు 55 లీటర్ల రక్షిత తాగునీటిని అందించే విధంగా తీర్చిదిద్దారు.గత పర్యటనలో గుర్తించిన లోపాలు, పునరుద్ధరణ ప్రక్రియలో నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాలు, పైపులు, సంపులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
