మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం మండ‌లి జేఈవో

తిరుప‌తి : టీటీడీ జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. గురువారం ఆయన ఆక‌స్మికంగా క‌ళాశాల‌, హాస్టల్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడి విద్యా సంస్థలలో సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. టిటిడి పాలక మండలి సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం 3,106 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తుండగా, వారిలో 2,350 మంది హాస్టల్ వసతి పొందుతున్నారని తెలిపారు. కళాశాల ప్రతిష్టను మరింత పెంపొందించేలా నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని, అందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థినులలో మెరుగైన ప్రతిభ కలిగినవారు, సగటు స్థాయి, తక్కువ స్థాయి, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థినులను గుర్తించి, సమతుల్య గ్రూపులుగా విభజించి బోధన నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఫలితాలను విశ్లేషిస్తూ ముందుకు సాగితే వంద శాతం ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. పరీక్షల ఫలితాలు తగ్గితే సంబంధిత అధ్యాపకులు బాధ్యత వహించాలన్నారు.

బోధన ప్రమాణాలు, వసతి, భోజనం, మౌలిక సదుపాయాలపై విద్యార్థినుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి నేరుగా తీసుకు రావాలని సూచించారు. అనంతరం వారితో కలిసి హాస్టల్‌లో భోజనం చేసి పలు సూచనలు చేశారు. కళాశాల ప్రాంగణంలోని శ్రీకృష్ణ దేవారాయుల కాలానికి చెందిన పురాతన బావిని పరిశుభ్రం చేసి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ కాంతులు , భక్తి భావాన్ని పెంపొందించే మ్యూజిక్ వాతావరణం ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి వైభవంతో పాటు దేశం, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలను తెలియజేసే సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ, వైస్ ప్రిన్సిపాల్ డా. భద్రమణి, వార్డెన్ డా. మల్లీశ్వరి, అధ్యాపకులు, సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!