తిరుమల : ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా, పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పని చేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడులతో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అదనపు ఈఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడకుండా రుచికరమైన అన్న ప్రసాదాలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలన్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా పెట్టుకోవాలని చెప్పారు. గరుడ వాహనం రోజున అధిక మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన విధంగా ఆర్టీసీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామివారికి నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకులను గుర్తించి వారి సేవలను బ్రహ్మోత్సవాలకు వినియోగించుకోవాలని సూచించారు.
అనంతరం ఈవో అధికారులతో కలిసి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించి, మిగిలిన పనులను సెప్టెంబర్ 14లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
