చెన్నై : తమిళనాడు రాష్ట్రానికి మరో ఇంటర్నేషనల్ సంస్థ రానుంది. ఈ మేరకు ఇవాళ సీఎం విజయ్ తో కీలక ఒప్పందం చేసుకుంది స్టార్ బక్స్. ఈ సందర్బంగా చెన్నైలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇది భారతదేశంలో స్టార్‌బక్స్ కు సంబంధించి మొట్ట మొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ కానుంది . దేశంలో ‘టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్’తో ఉన్న రిటైల్ జాయింట్ వెంచర్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పని చేస్తుంది. అధికారిక ప్రకటన ప్రకారం ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమక్షంలో సోమవారం ఈ ప్రాజెక్ట్ కోసం స్టార్‌బక్స్ ఒక అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ కాఫీ హౌస్ సంస్థ స్టార్‌బక్స్, చెన్నైలో తన మొదటి భారతీయ జీసీసీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. దీనివల్ల రాష్ట్రంలో 800కు పైగా అధిక వేతనం లభించే సాంకేతిక ఉద్యోగాలు సృష్టించ బడతాయని అంచనా.
రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక , వాణిజ్య శాఖ ప్రకారం ఈ ప్రాజెక్ట్ సాంకేతిక నిపుణుల కోసం 800 అధిక-వేతన ఉద్యోగాలను కల్పిస్తుంది. ఎంఓయూ కార్యక్రమంలో స్టార్‌బక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ తిరు. ఆనంద్ వరదరాజన్ మాట్లాడారు. తమ సంస్థకు భారతదేశం చాలా కీలకమని పేర్కొన్నారు. చెన్నైలో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు పుష్కలంగా ఉన్నారు, ఇక్కడి ఉద్యోగులు సంస్థలతో ఎక్కువ కాలం కొనసాగుతారు అని తెలిపారు. రాష్ట్రంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ప్రశంసించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు కొత్త పరిష్కారాలను కనుగొనడంలో, వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయ పడతాయి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరొక ప్రముఖ అమెరికన్ సంస్థ తమిళనాడులో జీసీసీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కొద్ది కాలానికే ఈ పరిణామం చోటు చేసుకుంది.