2,144 మందికి సీఎం అపాయింట్మెంట్ లెట‌ర్స్

751 అసిస్టెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, 1393 హెల్త్ ఇన్స్పెక్టర్స్

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ దూకుడు పెంచారు. వ‌రుస‌గా నియామ‌క పత్రాలు ఇస్తూ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. మంగ‌ళ‌వారం సీఎం విజయ్ 2,144 మంది వైద్య సిబ్బందికి నియామక పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన 751 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు , 1,393 మంది హెల్త్ ఇన్‌స్పెక్టర్లకు నియామక ఉత్తర్వులను అందజేశారు. అలాగే, చెన్నైలో రూ. 140 కోట్ల విలువైన వైద్య మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలోని స్టేట్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులను అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.జి. అరుణ్‌రాజ్ మాట్లాడుతూ నేడు తమిళనాడు ఆరోగ్య శాఖకు ఒక సువర్ణ దినం, ఎందుకంటే రూ. 140 కోట్ల విలువైన కొత్త మౌలిక సదుపాయాలు , నలం వెబ్‌సైట్‌ను సీఎం ఈ రోజు ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

కుర్చీలో కూర్చుని ఆదేశాలు జారీ చేసేవాడు నిజమైన నాయకుడు కాదు, ప్రజలతో ప్రేమతో నిలిచేవాడే నిజమైన నాయకుడు. నాయకుడికి మానవత్వం, సానుభూతి ,ప్రేమ ఉండాలని అన్నారు మంత్రి. మా నాయకుడు సీఎంకు అటువంటి లక్షణాలు ఉన్నాయ‌ని అన్నారు. ముఖ్యమంత్రి పెరంబూర్ నియోజకవర్గాన్ని సందర్శించి, అక్కడ కొత్త ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించారు. సీఎం విజయ్ పెరంబూర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప్రముఖ తమిళ రచయిత , సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పూమని మృతి పట్ల సీఎం జోసెఫ్ విజయ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల సమయంలో ప్రభుత్వ లాంఛనాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

Leave A Reply

Your Email Id will not be published!