విజయవాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ పాలిట శాపంగా మారాడని ఆరోపించారు. మంగళవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. పోలవరం పాలిట సీఎం చంద్రబాబు కిల్లర్ గా మారాడని మండిపడ్డారు .ఉద్దరించడం కాదు.. దగ్గరుండి ఊపిరి తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాడిలో జీవం తీసి, మోదీజీ మెప్పుకోసం పోలవరానికి వెన్నుపోటు పొడుస్తున్న అభినవ కట్టప్ప అంటూ ఎద్దేవా చేశారు. 41.15 మీటర్ల ఎత్తులో ఉపయోగం లేదని, ప్రాజెక్ట్ ప్రయోజనాలు అసంపూర్ణమని, బహుళార్థకం కాస్త నీటి నిల్వకే పరిమితమని, ఎత్తు తగ్గింపుతో పోలవరం ఆత్మహత్య సదృశ్యమని చంద్రబాబు తెలిసి చేస్తున్న డ్రామానే ఇదంతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి.
32 వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ మిగులు కోసం ప్రాణాధార లాంటి ప్రాజెక్టు నిర్వీర్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలవరంపై చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అని ఆరోపించారు. ప్రాజెక్టును తానే 37 సార్లు సందర్శించి, 136 సార్లు రివ్యూ చేశానని గొప్పలు చెప్పడానికున్న శ్రద్ధ 45.72 మీటర్ల ఎత్తులోనే కట్టాలని, దశలు దిశలు వద్దని కేంద్రాన్ని నిలదీయడంపై లేదన్నారు. గ్రావిటీ ప్రాజెక్ట్ కాస్తా ఎత్తిపోతల పథకంగా మారుతుంటే కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ముఖ్యమంత్రికి లేకపోవడం రాష్ట్రానికి చేస్తున్న తీరని అన్యాయం తప్ప మరోటి కాదన్నారు. మార్చ్ 31 లోపు జాతికి అంకితం ఇస్తామని ప్రకటించిన చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పలు ప్రశ్నలు సంధించారు షర్మిలా రెడ్డి.
