మతం అనేది ఇంటికే పరిమితం కావాలి : కె. అన్నామ‌లై

లౌకిక విధానంతో రాజకీయ కార్యాచరణను ప్రకటన‌

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బీజేపీకి రాజీనామా చేసిన త‌ర్వాత ఏర్పాటు చేసిన తొలి స‌భ‌లో స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌తం అనేది ఇంటికే ప‌రిమితం కావాల‌ని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న టీవీకే పట్ల రాజీ ధోరణిని ప్రదర్శించడం విస్తు పోయేలా చేసింది. ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తోంద‌ని, అది గ‌నుక త‌డ‌బాటుకు లోనైతే మ‌నంద‌రం క‌లిసి ప‌డిపోకుండా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు. పొల్లాచ్చిలో వి ది లీడ‌ర్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. ఈ సంస్థ‌కు కె. అన్నామ‌లై చీఫ్ మెంటార్ గా ఉన్నారు. తన స్వచ్ఛంద ఉద్యమమైన వీ ది లీడర్స్ రాబోయే కాలంలో ఒక రాజకీయ పార్టీగా మారుతుందని, అది లౌకిక రాజకీయ విధానాన్ని అనుసరిస్తుందని ప్ర‌క‌టించారు.

అంతే కాదు తాను ఎల్లప్పుడూ గర్వించదగ్గ జాతీయవాదినన‌ని, అదే స‌మ‌యంలో యావ‌త్ ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన గౌర‌వం క‌లిగిన భార‌తీయుడిన‌ని స్ప‌ష్టం చేశారు కె. అన్నామ‌లై. తమిళనాడును అగ్రగామి రాష్ట్రంగా చూడటమే తన లక్ష్యమని వెల్ల‌డించారు. ఒక గర్వించదగ్గ తమిళుడు ‘భారతదేశం’ అనే భావనను వ్యతిరేకించగలడా లేదా ఒక గర్వించదగ్గ భారతీయుడు తమిళ అస్తిత్వానికి వ్యతిరేకంగా నిలబడగలడా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి రాజకీయాలు మాకు అవసరం లేదని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇదిలా ఉండ‌గా బీజేపీలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించే శైలికి పేరుపొందిన అన్నామలై ఉన్న‌ట్టుండి తాజాగా అధికారంలో ఉన్న విజ‌య్ ప్రభుత్వం పట్ల రాజీ ధోరణిని ప్రదర్శించారు . అందులోని చాలా మంది ఎమ్మెల్యేలు అనేక సవాళ్లను అధిగమించి సాధారణ నేపథ్యాల నుండి పైకి వచ్చారని అన్నామలై చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!