న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీలోని అయోధ్య రామ మందిరం పేరుతో వసూలు చేసిన విరాళాల చోరీపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనిపై యూపీ సర్కార్ సిట్ వేసింది. ఇందుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అయోధ్య ఆలయ విరాళాల చోరీ వివాదంపై యూపీ సిట్ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు. ముగ్గురు పిటిషనర్లలో ఒకరైన నరేంద్ర కుమార్ గోస్వామి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించిన విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించింది ధర్మాసనం.
ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం, విరాళాల ‘చోరీ’ వివాదంపై నిష్పాక్షికమైన, నిర్ణీత కాలపరిమితితో కూడిన విచారణను కోరుతూ దాఖలైన పిటిషన్లపై ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు నోటీసులు జారీ చేసింది. రామ మందిర వ్యవహారాలను నిర్వహించే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ నిర్వహించాలని కూడా గోస్వామి కోరారు. అజయ్ కుమార్ రాయ్ , దినేష్ కుమార్ యాదవ్ ఇదే తరహా చర్యలను కోరుతూ రెండవ పిటిషన్‌ను దాఖలు చేశారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలని కోరడంతో పాటు, ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన మూడవ పిటిషన్‌లో ఆలయ ట్రస్ట్ మొత్తం ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు.
అంతకు ముందు జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం, పిటిషనర్లలో ఒకరిని ఈ కేసును తదుపరి తేదీన అత్యవసర విచారణ కోసం ప్రస్తావించమని సూచించింది. న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్ , దినేష్ కుమార్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌లో, ఆలయ ట్రస్ట్ వ్యవహారాలు , పరిపాలనకు సంబంధించిన ఆర్థిక అక్రమాలు , ఇతర చట్టవిరుద్ధమైన చర్యలపై సీబీఐ నేతృత్వంలోని బహుళ-విభాగాల ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని పేర్కొన్నారు.
