దేవాదుల ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తి చేస్తాం

ప్ర‌క‌టించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

ములుగు జిల్లా : దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, గోదావరి జలాలను ప్రవహింప జేస్తాం అని ప్ర‌క‌టించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందించడం, రైతులకు శాశ్వత భరోసా కల్పించడం ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును పరిశీలించే క్రమంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో క‌లిసి కన్నాయిగూడెం మండలం తుపాకలగూడెం సమీపంలోని సమ్మక్క-సారలమ్మ బ్యారేజీకి చేరుకున్నారు. అక్క‌డ గోదావరి నదీ జలాల ప్రవాహం, నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించారు.

అక్కడి నుండి తుపాకలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టల గంగారంలో ఉన్న జె. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు వాటర్ పాయింట్, పంపింగ్ హౌస్‌కు చేరుకుని, మోటార్ల పనితీరు, నీటిని ఎత్తిపోసే సామర్థ్యం (లిఫ్టింగ్ కెపాసిటీ), ఇతర అంశాలను సమీక్షించారు. ఆ తర్వాత, దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు, భూసేకరణ, ఎత్తిపోతల సామర్థ్యం, ​​సాగునీరు , తాగునీరు, మోటార్ల పనితీరుపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఇంజనీరింగ్ అధికారులు సంబంధిత శాఖల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను వివరించారు.

సీఎం ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిస్థితులు ఏవైనప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంద‌ని ఈ సంద‌ర్బంగా చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సుమారు 6.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఇందులో దాదాపు 92 శాతం ఆయకట్టు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా, మిగిలిన భాగం నల్గొండ జిల్లా వరకు విస్తరించి ఉందని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!