హైదరాబాద్ : హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ కర్ణన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ కట్టడాన్ని నిర్మించిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా కట్టారంటూ పేర్కొన్నారు. ఈ మేరకు నిలుపుదల చేయాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ వివాదం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్దానికి దారితీసింది. గత కేసీఆర్ సర్కార్ హయాంలో ప్రదీప్ రెడ్డి నిర్మాణ సంస్థ అనుమతి పొందినట్లు టాక్. ఇది పక్కన పెడితే వందల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగి పోవడంతో గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయించింది నిర్మాణ సంస్థ.
నిర్మాణాల కోసం ఇచ్చిన అనుమతిని రద్దు చేశారని హైకోర్టులో పిటిషన్ వేశారు నిర్మాణ సంస్థ ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ యజమాని ప్రదీప్ రెడ్డి. రద్దు నోటీస్ ను నిలిపి వేయాలంటూ కోర్టుకు విన్నవించారు. నెక్లెస్ రోడ్ లో సోమాజిగూడ పరిధిలో తాము నిర్మిస్తున్న హైరైజ్ అపార్ట్మెంట్స్ వెంచర్ కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఇచ్చిన అనుమతులను..ఏళ్ల తర్వాత రద్దు చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఏ మాత్రం చట్టబద్ధతలేని హైడ్రా అనే ప్రభుత్వ ఏజెన్సీ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకుని ఎలా నోటీసులు ఇస్తుందంటూ ఆరోపించారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన నోటీసులు నిలిపి వేయాలని కోరారు. హెచ్ ఎం డీ ఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖ మున్సిపల్ శాఖతో పాటు భూమిని విక్రయించిన వారిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
