Telangana Dangal Comment : చ‌తుర్ముఖ పోరులో చ‌క్రం తిప్పేదెవ‌రో

తెలంగాణ దంగ‌ల్ లో హంగ్ త‌ప్ప‌దా

Telangana Dangal : దేశం చూపు ప్ర‌స్తుతం తెలంగాణ(Telangana) వైపు చూస్తోంది. నిన్న‌టి దాకా వార్ వ‌న్ సైడ్ అవుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ సీన్ మారింది. కుల స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో వీటి ప్ర‌భావం అత్య‌ధికంగా ఉండ‌బోతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స‌ర్కార్ ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి రావాల‌ని చూస్తోంది. తాము ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని భావించింది. ప్ర‌తిప‌క్షాల‌ను ఎప్ప‌టికప్పుడు షాక్ ల మీద షాక్ లు ఇస్తూ గుక్క తిప్పు కోనీయ‌కుండా చేసే ద‌మ్మున్న లీడ‌ర్ గా గుర్తింపు పొందాడు సీఎం కేసీఆర్ . దేశంలోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన ప్రాంతీయ పార్టీగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఆ పార్టీ ఆస్తులు దాదాపు రూ. 700 కోట్ల‌కు చేరుకోవ‌డం విస్తు పోయేలా చేసింది.

Telangana Dangal Comment Viral

ఇవాళ ప్ర‌తి ఎమ్మెల్యే కోట్ల‌ల్లో ప‌డ‌గ‌లు ఎత్త‌డం ఆ పార్టీకి అస్సెట్ అనుకుంటుండ‌గా ప్ర‌జ‌లు మాత్రం తాము ఇబ్బందుల్లో ఉన్నా ప‌ట్టించు కోవ‌డం లేద‌ని వాపోతున్నారు. వీటి గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు. అమ‌ల‌వుతున్న రైతు బంధు, క‌ళ్యాణ లక్ష్మి, షాదీ ముబార‌క్ త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని భావించారు. కానీ త‌మ కు నిరుద్యోగుల రూపంలో ముప్పు పొంచి ఉంటుంద‌ని బీఆర్ఎస్ ప‌సిగ‌ట్ట లేక పోయింది. ఆ పార్టీ ప్ర‌క‌టించిన మేని ఫెస్టోలో వారి గురించిన ప్ర‌స్తావ‌న లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ముంద‌స్తుగా అన్ని పార్టీల‌కంటే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించినా ప్ర‌తి చోటా క‌నిపించ‌ని అసంతృప్తి ఆ పార్టీని వెన్నాడుతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించింది. ఎక్క‌డా త‌మ లోటు పాట్ల‌ను క‌నిపించ నీయ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. ఆ పార్టీకి బిగ్ అస్సెట్ ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి. త‌ను అన్నీ తానై న‌డిపించ‌డం, ఆయ‌న వెనుక స్ట్రాట‌జిస్ట్ సునీల్ క‌నుగొలు ఉండ‌డం, పార్టీ హైక‌మాండ్ కూడా జ‌ల్లెడ ప‌ట్ట‌డం, విస్తృతంగా ప‌ర్య‌టించ‌డం మొత్తంగా అధికార పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా మారేలా చేసింద‌న‌డంలో సందేహం లేదు. అంతే కాదు కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ స‌ర్కార్ ఒక్క‌టేన‌ని ప్ర‌చారం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది. దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో అన్ని పార్టీల కంటే ముందంజ‌లో ఉంది. గ‌తంలో దూర‌మైన మైనార్టీలు ఈసారి పార్టీ వైపు మొగ్గు చూప‌డం ఒకింత అద‌న‌పు బ‌లంగా మారింది.

మ‌రో వైపు బీజేపీ అనూహ్యంగా కీల‌క‌మైన పాత్ర పోషించేందుకు రెడీ అవుతోంది. ఆ పార్టీ బీసీని ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని చెప్ప‌డం, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించ‌డం , హిందూ ఓటు బ్యాంక్ త‌మ వైపు ఉండ‌డంతో చాలా చోట్ల ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల జ‌యాప‌జ‌యాల‌ను నిర్దేశించే స్థాయికి చేరుకుంది. అంతే కాకుండా బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ పోల్ మేనేజ్మెంట్ చేయ‌డంలో అందె వేసిన చేయి. ఈసారి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ గ‌డుతూనే మ‌రో వైపు మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా తెలంగాణ‌ను(Telangana) కార్న‌ర్ చేశారు.

ఇంకో వైపు బీఎస్పీ ప‌గ్గాలు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీసుకున్నాక ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. చాలా చోట్ల ఓట్ల‌ను చీల్చే ఛాన్స్ ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అస‌దుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కూడా ఈసారి కీల‌కంగా మార‌నుంది. 119 సీట్ల‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే క‌నీసం 61 సీట్లు రావాల్సి ఉంటుంది. ఒక‌వేళ 50 సీట్ల‌కే ప‌రిమితం అయితే అప్పుడు బీజేపీ, ఎంఐఎం కింగ్ పిన్ లుగా మార‌నున్నాయి. మొత్తంగా చ‌తుర్ముఖ పోటీల‌లో చ‌క్రం ఎవ‌రు తిప్పుతార‌నేది వేచి చూడాలి.

Also Read : Telangana BJP Comment : పాగా వేసేనా ప‌వ‌ర్ లోకి వ‌చ్చేనా

Leave A Reply

Your Email Id will not be published!