హైదరాబాద్ : దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం (SC/ST (Prevention of Atrocities) Act, 1989) అమలుపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 ఫిబ్రవరి 11న అనాటి ముఖ్యమంత్రి అధ్యక్షతన చట్టం అమలుపై ఈ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మళ్లీ ఈ సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న సహాయం, పునరావాసంపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరును విశ్లేషించారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో ప్రధానంగా 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదించారు. అక్కడ పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి ఘటనల్లో బాధితులకు సకాలంలో నష్ట పరిహారం, సహాయ పునరావాసం అందేలా చూడాలన్నారు. బాధితులను ఆదుకోవడంలో బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్‌లో విడుదల చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇటీవల షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించి, బాధిత కుటుబాలకు సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. సొంత తల్లిలా ప్రేమ చూపిన మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆ వర్గాలు ఇప్పటికీ మరిచి పోలేదని పేర్కొన్నారు.
