బెంగళూరు : ఐపీఎల్ 2026 మహా సంగ్రామం మార్చి 28న శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్. ఇరు జట్లు ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది అభిమానుల్లో. ఎస్ ఆర్ హెచ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ కు పేరు పొందింది. రెండు జట్లలోనూ బలమైన లైనప్‌లు ఉన్నాయి. ఇరు జట్లు ఐపీఎల్ లో ఇప్పటి వరకు 25 సార్లు తలపడ్డాయి. ఆర్సీబీ 11 మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఎస్ ఆర్ హెచ్ 13 మ్యాచ్ లలో గెలుపొందింది.
ఇక ఇదే మైదానంలో ట్రాక్ రికార్డు చూస్తే ఆర్సీబీ జట్టుదే పై చేయిగా ఉంది. ఇక్కడ ఆర్సీబీ 5 మ్యాచ్ లలో ఆధిపత్యం చెలాయిస్తే 3 మ్యాచ్ లు హైదరాబాద్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక రన్స్ పరంగ చూస్తే ఆర్‌సిబిపై ఎస్‌ఆర్‌హెచ్ 287 పరుగులు చేసింది .ఆర్‌సిబి 262 పరుగులతో బదులిచ్చింది. ఇది పూర్తిగా బ్యాటింగ్ పిచ్. పరుగులు ధారాళంగా వస్తాయి. మొదట ఎవరు బ్యాటింగ్ చేసినా ఆ జట్టు భారీ స్కోర్ నమోదు చేస్తూ వచ్చింది. తొలుత ఎవరు బ్యాటింగ్ కు దిగుతారో వారే అంతిమంగా విజయానికి దగ్గరగా ఉంటారని గత మ్యాచ్ ల ఫలితాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది.
ఇక ఆటగాళ్ల పరంగా చూస్తే విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తనకు భువనేశ్వర్ కుమార్ కు మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. స్వింగ్ వర్సెస్ టెక్నిక్‌ను పరీక్షించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరాటాలలో ఇది ఒకటి . ట్రావిస్ హెడ్ వర్సెస్ ఆర్‌సిబి బౌలర్ల మధ్య ఆసక్తికరమైన పోరు కొనసాగనుంది. హెడ్ తన విధ్వంసకరమైన ఆరంభాలకు ప్రసిద్ధి చెందాడు, అవి మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలవు కూడా. హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ స్పిన్. స్పిన్‌ను చిన్నాభిన్నం చేయగల క్లాసెన్ సామర్థ్యం మ్యాచ్‌కు మలుపు కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
