‘స్పంద‌న’ కార్య‌క్ర‌మం మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చం

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : మహిళలు, పిల్లల రక్షణ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మహిళలకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో షీ టీమ్స్ ఏర్పాటు, స్టాండ్ విత్ హర్ లాంటి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అదే కోవలో కొత్తగా స్పందన (తక్షణ రక్షణ) బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.’ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్పంద‌న వాహనాలకు ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగర పోలీసులు, పీస్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో స్పందన టీమ్‌లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళ తన కాళ్ల మీద తాను నిలబడాలంటే వారికి తగిన రక్షణ కల్పించాలన్నారు. వారి పిల్లలకు భద్రత ఉండాలి. మహిళ చదువు, వ్యాపారాన్ని స్వేచ్ఛగా నిర్వహించినప్పుడే సమాజం ప్రగతి సాధిస్తుంది అని నొక్కి చెప్పారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలను పూర్తిగా నిరోధించి వారికి తగిన రక్షణ కల్పించే విషయంలో స్వచ్ఛంధ సంస్థలు, పీస్ కమిటీలు కూడా సామాజిక బాధ్యతగా పని చేయాలని కోరారు. మహిళల పట్ల దురుసుగా, అవహేళనగా ప్రవర్తించిన వారిని శిక్షించడానికి షీ టీమ్స్ ఏర్పాటు చేశామ‌న్నారు సీఎం. సమాజంలో వివక్షకు గురవుతున్న మహిళకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ఆమెకు అండ‌గా నిల‌బ‌డ‌దా అన్న కార్యక్రమం చేపట్టాం అని తెలిపారు. ఈరోజు మరో అడుగు ముందుకేసి నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు పనిచేసే స్పందన టీమ్‌లను ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల అభినందించారు.

ఈ టీమ్‌లు బాధితుల వద్దకు వెళ్లి ముందు వారికొక మానసిక ధైర్యాన్ని కల్పిస్తాయన్నారు. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని తెలిపారు. మహిళ తన గౌరవాన్ని కాపాడటంలో ఈ ప్రభుత్వం, ఈ సమాజం పక్కన నిలబడుతుందన్న నమ్మకం, విశ్వాసం వారిలో కల్పించాలని స్ప‌ష్టం చేశారు సీఎం.మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు స్పందించడం కన్నా సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత పౌర సమాజంపైన కూడా ఉంది అని గుర్తు చేశారు. పీస్ కమిటీల సామాజిక బాధ్యతలను విస్తరించాలి. అసాంఘిక చర్యలను నియంత్రించడంలో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. కమిటీ సభ్యులు వారి ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చేరవేయాలని సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!