ఎంఎస్ ధోనీతో ఆడాల‌న్న కోరిక నెర‌వేరింది

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్

కేర‌ళ : ఇండియ‌న్ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడ‌డం సీఎస్కేలో ఎందుకు చేరాన‌న్న దానిపై త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు. ఆకాష్ చోప్రాతో జియో హాట్ స్టార్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు ప్రశ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు. తనకు ఐపీఎల్ లో అవకాశం దక్కడంలో శ్రీశాంత్ పాత్రను మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం తన చిన్ననాటి కలను సాకారం చేసిందని చెప్పాడు సంజు శాంస‌న్. 11 ఏళ్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం కష్టమైన నిర్ణయమని చెప్పాడు. అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ తరపున , ఎంఎస్ ధోనీతో కలిసి ఆడే అవకాశం తన నిర్ణయంపై ప్రభావం చూపిందని వెల్లడించారు. రాజస్థాన్ రాయల్స్‌తో 11 ఏళ్లు గడిపి, ఐదు సీజన్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన సంజూ శాంసన్ ఐపీఎల్ 2026కు ముందు ‘ట్రేడ్’ (ఆటగాళ్ల మార్పిడి) ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు.

శ్రీశాంత్ భాయ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు, కేరళ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతి ఏటా ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్‌కు తీసుకెళ్లడం నేను చూసేవాడిని. ఆ సమయంలో, పరుగులు చేయలేక పోవడంతో నన్ను కేరళ జట్టు నుంచి తొలగించారు. ఒక కీలకమైన రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడటానికి శ్రీశాంత్ వ‌చ్చాడు. ఆయన మా సెక్రటరీ మాథ్యూ కు ఫోన్ చేసి, ‘నాకు జట్టులో సంజూ కావాలి’ అని చెప్పాడు. . అతను సరిగ్గా ఆడటం లేదు కదా, మనం అతన్ని ఎందుకు తీసుకోవాలి? అని మాథ్యూ సార్ అడిగారు. కానీ శ్రీ భాయ్ పట్టుబట్టి, ‘లేదు, అతన్ని తీసుకురండి. అతనితో నేను రాణించేలా చేస్తాను’ అని చెప్పాడు. అప్పుడు నా వయసు సుమారు 16 ఏళ్లు. నేను మొదటి ఇన్నింగ్స్‌లో 122 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేశాను. మ్యాచ్ తర్వాత, శ్రీ భాయ్ నన్ను జైపూర్‌లో జరిగిన ట్రయల్స్‌కు తీసుకెళ్లారు.

రాహుల్ ద్రవిడ్ నన్ను కలవడానికి మొదటిసారి వచ్చారు. ఆయన సమక్షంలోనే, శ్రీ భాయ్ నా గురించి గొప్పగా చెబుతూ ఉత్సాహ పరిచారు. ‘రాహుల్ భాయ్, ఈ అబ్బాయిని చూడండి. నా బౌలింగ్‌లో చాలా పరుగులు చేశాడు. సిక్సర్లు కొట్టాడని చెప్పాడు. అప్పటికే నేను ఒత్తిడిలో ఉన్నాను, దానికి తోడు ఆయన నా గురించి చాలా కథనాలు అల్లి చెప్పారు. కానీ ఎలాగోలా, ఆ తర్వాత నేను కొన్ని సిక్సర్లు కొట్టగలిగాను. ట్రయల్స్‌లో నా ప్రదర్శన చూసి రాహుల్ సర్ ముగ్ధులయ్యారు, నన్ను రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తీసుకున్నారు. ఆయన నాతో నిన్ను ఆడించే బాధ్యత నాది. ఈ జట్టులో నీకు కచ్చితంగా అవకాశం దొరుకుతుందని నేను హామీ ఇస్తున్నాను. ఇతర జట్ల సంగతి నాకు తెలియదు కానీ, ఇక్కడ మాత్రం నీకు అవకాశం ఇస్తాను అని చెప్పారు.

నేను ట్రయల్స్‌లో బాగా రాణించాను, అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ తరపున కూడా మంచి ప్రదర్శన చేశాను. ఐపీఎల్ కి ముందు జరిగిన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాహుల్ సర్ నాకు ఆడే అవకాశం ఇచ్చారు, కానీ నేను బాగా ఆడలేక పోయాను. అయినప్పటికీ, ఆయన నాకు అవకాశం ఇస్తానని మాటిచ్చారు. కానీ మొదటి మ్యాచ్ కోసం తుది జట్టును ప్రకటించినప్పుడు, అందులో నా పేరు లేదు. అయితే, అది ఒక రకంగా మంచికే జరిగింది. నేను దాదాపు ఐదు లేదా ఆరు మ్యాచ్‌లు ఆడకుండా బయటే కూర్చున్నాను. ప్రతిరోజూ దాదాపు అరగంట సేపు రాహుల్ సర్‌తో మాట్లాడేవాడిని. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఆయనను అడిగేవాడిని. ఆ మొదటి ఆరు మ్యాచ్‌ల సమయంలో నేను పెద్ద ఆటగాళ్ల అనుభవాల నుంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేవాడిని.

షేన్ వాట్సన్, రాహుల్ సర్, అజింక్య రహానే, బ్రాడ్ హాడ్జ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు అక్కడ ఉన్నారు. నేను కేవలం 18 ఏళ్ల కుర్రాడిని, వాళ్లను ప్రశ్నలు అడిగేవాడిని. నా దగ్గర ఒక చిన్న డైరీ ఉండేది. వాళ్లను ప్రశ్నలు అడిగి, గదికి తిరిగి వెళ్ళాక వాళ్లు చెప్పిన సమాధానాలను రాసుకునే వాడిని. ఒకవేళ నాకు మ్యాచ్ ఆడే అవకాశం వస్తే ఎలా ఆడాలి అనే విషయాలను నేను నోట్ చేసుకునేవాడిని అని అన్నాడు. మొదటి ఆరు మ్యాచ్‌ల తర్వాత, నాకు అవకాశం ఇస్తానని మాటిచ్చినప్పటికీ నన్ను ఎందుకు ఆడించడం లేదని రాహుల్ భాయ్‌ని అడిగే ధైర్యం చేశాను. నేను ఓపికగా ఉండాలని, నా సమయం ఖచ్చితంగా వస్తుందని ఆయన ప్రశాంతంగా వివరించారు. ఆ మాట విని నేను నిరాశకు, అసహనానికి గురయ్యాను, దాంతో నా కోపాన్నంతా నెట్స్ ప్రాక్టీస్‌లో చూపించాను. వాళ్లకు నా సత్తా చూపిస్తా అనుకుంటూ నెట్స్‌లో సిక్సర్లు కొట్టేవాడిని. అదృష్టవశాత్తూ, మా వికెట్ కీపర్ దిశాంత్ యాగ్నిక్ భాయ్‌కి గాయమైంది. నన్ను ఆడించే ప్రణాళిక ఏమీ లేదు, కానీ ఒక మ్యాచ్ కోసం దిశాంత్ భాయ్ అందుబాటులో లేకుండా పోయారు.

దాంతో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో నన్ను ఆడించారు; అదే 2013లో నా ఐపీఎల్ అరంగేట్రం. ఆ మ్యాచ్‌లో జట్టు గెలుపులో నేను కీలక పాత్ర పోషించాను. అది నా మొదటి మ్యాచ్. నంబర్ 6 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 27 పరుగులు (నాట్ అవుట్) చేశాను. వికెట్ కీపింగ్ చేస్తూ మూడు-నాలుగు వికెట్లు పడగొట్టడంలో (క్యాచ్‌లు లేదా స్టంపింగ్స్ ద్వారా) కూడా భాగమయ్యాను. కానీ తర్వాతి మ్యాచ్‌కి దిశాంత్ భాయ్ కోలుకుని తిరిగి రావడంతో, నన్ను జట్టు నుంచి తప్పించారు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు, మాహీ భాయ్ అప్పుడే భారత జట్టులోకి వచ్చారు. ఆయన వ్యవహార శైలి, దూకుడుగా బ్యాటింగ్ చేసే విధానం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నేను ఆయనను నిశితంగా గమనించడం మొదలు పెట్టాను. ఆయన ప్రకటనల్లో కనిపించేవారు, నేను ఆ ఫోటోలను కత్తిరించి నా డైరీలో అతికించుకునే వాడిని. ప్రతి పిల్లవాడికి ఒక ఆదర్శం ఉంటుంది, నాకు మాహీ భాయ్ ఆదర్శం. చిన్నప్పుడు నేను ప్రతిరోజూ భారత్ ఆడే మ్యాచ్‌లను చూసేవాడిని. మాహీ భాయ్ కెప్టెన్‌గా ఉంటూ మ్యాచ్‌లు గెలిపించే వాడ‌ని ప్ర‌శంసించాడు.

Leave A Reply

Your Email Id will not be published!