Manish Sisodia : కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్ర
బీజేపీపై డిప్యూటీ సీఎం సిసోడియా కామెంట్స్
Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను హత మార్చేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. శుక్రవారం మనీష్ సిసోడియా(Manish Sisodia) మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపాయి. ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఆప్ భయపడదని స్పష్టం చేశారు. ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ భద్రత గురించి తాము ఆందోళన చెందుతున్నామని అన్నారు.
సీఎం హత్యకు బీజేపీ ప్లాన్ చేసిందని , ఇందులో ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గుజరాత్ , ఎంసీడీ ఎన్నికల్లో ఓటమి భయంతో అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు మనీష్ సిసోడియా(Manish Sisodia). ఎంపీ మనోజ్ తివారీ తన గూండాలను కేజ్రీవాల్ పై దాడి చేసేందుకు ప్లాన్ చేశాడని ఆరోపించారు.
బీజేపీ, ఎంపీ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. బీజేపీకి తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ప్రజలు ధర్మం వైపు, ఆప్ పట్ల స్పష్టంగా ఉన్నారని అంతిమ విజయం తమదేనని మరోసారి స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.
చిల్లర రాజకీయాలు, గూండాయిజానికి ఇది సమయం కాదన్నారు. ఎంసీడీ ఎన్నికల్లో కావాలని దుష్ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా మనీష్ సిసోడియా చేసిన ఆరోపణలను మనోజ్ తివారీ ఖండించారు.
Also Read : అంగుళం భూమిని వదులుకోం – షిండే