ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ దుమ్ము రేపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 177 రన్స్ చేసింది. దీంతో ముంబై ముందు 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇక లక్నో స్టార్ క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. లక్నో లోని ఎకానా స్టేడియంలో పరుగుల వరద పారించాడు. మార్కస్ స్టోయినిస్ 7వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 35 బంతులు ఎదుర్కొని ఫిప్టీ చేయడం విశేషం. మొత్తం 47 బాల్స్ ఎదుర్కొన్న మార్కస్ 89 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక కెప్టెన్ కృనాల్ పాండ్యా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
49 పరుగుల వద్ద ఉండగా గాయపడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇక కోల్పోయిన వికెట్లలో క్వింటన్ డికాక్ , ప్రేరక్ మన్కడ్ , దీపక్ హూడా ఉన్నారు. డికాక్ 16 రన్స్ చేస్తే మన్కడ్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక టాప్ ఫామ్ లో ఉన్న దీపక్ హూడా 5 రన్స్ మాత్రమే చేశాడు. కష్టాల్లో ఉన్న తమ జట్టును కెప్టెన్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ ఆదుకున్నారు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు.
