Digital Health Profile: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారీకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారీకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !
Digital Health Profile: రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారీకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆధార్ కార్డు మాదిరీగా యూనిక్ నంబర్ తో ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను సిద్ధం చేస్తుంది. ఈ కార్డును ఆరోగ్య శ్రీకు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారీపై వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Raja Narasimha), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, సంయుక్త కార్యదర్శి వినయ్‌కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ ప్రొపైల్ ను త్వరితగతిన తయారు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ నంబర్) ఉండాలని… కార్డులతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలన్నారు. ఈ కార్డుల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
Digital Health Profile – వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ ఫిజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఉన్న ప్రతిచోట విధిగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా ప్రత్యేక విధానం తీసుకురావాలని ఆదేశించారు. వరంగల్, ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్‌లలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలన్నారు. కొడంగల్‌లో వైద్య, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని… ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందని చెప్పారు. ఎయిమ్స్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని… దాని ఆధారంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రితో చర్చిస్తామని అధికారులకు తెలిపారు.
Also Read : Telangana Police : విద్యార్థి సంఘ నేతపై చేయి చేసుకున్న కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు
